న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ ఒత్తిడిని అధిగమించేందుకు తరుచూ చాయ్ తాగానని చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే అన్నాడు. వర్షం అంతరాయం కలిగించడంతో మెళకువ ఉండేందుకు టీతో పాటు ఎనర్జీ డ్రింక్ రెడ్ బుల్ తాగానని తెలిపాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించి ఐదో టైటిల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
వర్షం అంతరాయంతో 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో డెవాన్ కాన్వే 47 పరుగులతో రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డెవాన్ కాన్వే ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రావడం ఆశ్చర్యం కలిగించిందని, జడేజా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో విలువైన పరుగులు చేశాడని చెప్పాడు.

'ఐపీఎల్ 2023 టైటిల్ గెలవడం ఎంతో స్పెషల్. మా ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే వర్షం మొదలైంది. అప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న మేం మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా.. అని ఎదురుచూశాం. మాకు లక్ష్య చేధనలో ఎన్ని ఓవర్లు వస్తాయో తెలియక ఆ అర్ధరాత్రి మెలకువగా ఉండేందుకు నేను చాలాసార్లు చాయ్ తాగాను.
ఫైనల్ టెన్షన్‌ను తట్టుకునేందుకు ఇది ఉపయోగపడింది. బ్యాటింగ్‌కు వెళ్లే ముందు మైక్ హస్సీ నాతో.. 'మేట్ మెలకువగా ఉండటానికి రెడ్‌బుల్ డబ్బా కావాలా?'అని అడిగాడు. మ్యాచ్‌కు ఇలాంటి అంతరాయం కలిగినప్పుడు మానసికంగా సిద్ధంగా ఉండటం చాలా కష్టం. దీంతో మళ్లీ హుషారుగా మారడానికి రెడ్‌బుల్ తాగాను.
ఇది నేను తొలి బంతి నుంచి అలర్ట్‌గా ఉండేలా ఉపయోగపడింది. ఆ విధంగా మ్యాచ్‌ను పూర్తి చేయడం చాలా బాగుంది. ఎందుకంటే మేము అలాంటి అనుభవాన్ని ఎప్పుడూ చూడలేదు. రవీంద్ర జడేజా చివరి రెండు బంతుల్లో 10 రన్స్ చేసి మ్యాచ్‌ను గెలిపించడం మరింత ఉత్సాహన్ని కలిగించింది. ఆటగాళ్లంతా తెల్లవారుజాము వరకూ సంబరాలు చేసుకున్నారు.'అని డెవాన్ కాన్వే చెప్పుకొచ్చాడు.