హైరదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో మరో మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. 12 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ.. చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా టోర్నీలో ముందడుగు వేయలేదు. పంజాబ్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ చేజేతులా ఓటమిపాలైంది.
ఈ ఫలితంతో ఈ సీజన్‌లో అందరికన్నా ముందే ఎలిమినేట్ అయిన జట్టుగా ఢిల్లీ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇక 16 ఏళ్ల ఐపీఎల్ సీజన్‌లో అందరికన్నా ముందుగా ఎలిమినేట్ అయిన జట్లపై ఓ లుక్కెద్దాం.

ఐపీఎల్ అరంగేట్ర సీజన్‌లో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ అందరికన్నా ముందు నిష్క్రమించింది. వీవీఎస్ లక్ష్మణ్ సారథ్యంలో 12 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. 2009లో గిల్‌క్రిస్ట్ సారథ్యంలో చాంపియన్‌గా నిలిచిన డెక్కన్ చార్జర్స్ మళ్లీ 2011, 2012 సీజన్లలో అందరికన్నా ముందే ఇంటి బాట పట్టింది.
ఐపీఎల్ 2009 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అందరికన్నా ముందు నిష్క్రమించింది. 14 మ్యాచ్‌ల్లో 3 విజయాలు మాత్రమే సాధించిన కేకేఆర్.. వరుసగా 10 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. 2010, 15 సీజన్లలో పంజాబ్ కింగ్స్ ఈ అప్రతిష్టను మూటగట్టుకోగా.. 2013 సీజన్‌లో పూణే వారియర్స్ అందరికన్నా ముందే ఎలిమినేట్ అయ్యింది. 16 మ్యాచ్‌ల్లో 4 విజయాలు మాత్రమే అందుకుంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2017, 2019 సీజన్లలలో పేలవ ప్రదర్శనతో అందరికన్నా ముందే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2020 సీజన్‌లో నాలుగు సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ అందరికన్నా ముందే ఎలిమినేట్ అయ్యింది. 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిచి ఈ అప్రతిష్టను మూటగట్టుకుంది.
ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ గతేడాది వరుసగా 8 మ్యాచ్‌ల్లో ఓడి అందరికన్నా ముందే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.
2016 సీజన్‌లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ 14 మ్యాచ్‌ల్లో 5 మాత్రమే గెలిచి ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది. 2014, 2018, 2023 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ అప్రతిష్టను మూటగట్టుకుంది.