చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గాయంతో బెంచ్‌కే పరిమితమైన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. అతను మరో వారం రోజుల పాటు జట్టుకు దూరంగా ఉంటాడని సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ తెలిపాడు.
బెన్ స్టోక్స్ మొకాలి గాయం తిరగబెట్టడంతో బెంచ్‌కే పరిమితమయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు అతను అందుబాటులోకి వస్తాడని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. కానీ అతను పూర్తిగా కోలుకోకపోవడంతో మరో వారం జట్టుకు దూరంగా ఉంటాడని ఫ్లేమింగ్ చెప్పాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో విజయానంతరం మాట్లాడిన ఫ్లెమింగ్.. 'బెన్ స్టోక్స్ తిరగబెట్టిన గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అతను మరో వారం ఆటకు దూరంగా ఉండనున్నాడు'అని తెలిపాడు.

బెన్ స్టోక్స్ పునరాగమనం చెన్నై సూపర్ కింగ్స్‌కు చాలా ముఖ్యం. ఇప్పటికే ఆ జట్టు గాయాల కారణంగా చాలా మంది సేవలను కోల్పోయింది. ధోనీ మొకాలి గాయంతో బాధపడుతుండగా.. దీపక్ చాహర్ తొడకండరాల గాయంతో బెంచ్‌కే పరిమితమయ్యాడు. సిమ్రన్ జీత్ సింగ్ పాత గాయం నుంచి కోలుకుంటున్నాడు. సిసండా మగలా బొటన వేలి గాయంతో ఇబ్బంది పడుతున్నారు. కైల్ జెమీసన్, ముఖేశ్ చౌదరి తీవ్ర గాయాలతో సీజన్ మొత్తానికి దూరమయ్యారు.
ఈ క్రమంలోనే మరో ప్లేయర్ గాయపడితే చెన్నై క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనుంది. అంతేకాకుండా నాకౌట్ మ్యాచ్‌ల్లో మంచి రికార్డు ఉన్న బెన్ స్టోక్స్.. జట్టులోకి రావడం చాలా కీలకం. వీలైనంత త్వరగా రీఎంట్రీ ఇచ్చి ఫామ్ అందుకుంటే ఆ జట్టుకు తిరుగుండదు. ఫ్యూచర్ కెప్టెన్‌గా, కీలక ఆల్‌రౌండర్‌గా జట్టు విజయాలకు కృషి చేస్తాడని బెన్ స్టోక్స్‌ను రూ.16.25 కోట్ల భారీ ధరకు సీఎస్‌కే కొనుగోలు చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొంది నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది.
అనంతరం చెన్నై 18.3 ఓవర్లలో 138 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. మూడు వికెట్లతో సత్తా చాటిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మొత్తం 6 మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి సీఎస్‌కే పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది.