IPL 2023: టీ20 ప్రపంచకప్ హీరోలపై కన్నేసిన ఫ్రాంచైజీలు.. ఈ ఆటగాళ్లకు మినీవేలంలో కనక వర్షమే!

న్యూఢిల్లీ: ఇటీవల ముగిసన టీ20 ప్రపంచకప్ 2022లో సత్తా చాటిన ఆటగాళ్లపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేసాయి. ముఖ్యంగా ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపిన ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్లు సామ్ కరన్, బెన్ స్టోక్స్‌లను మినీ వేలంలో కొనుగోలు చేసేందుకు సమాయాత్తం అవుతున్నాయి. అప్‌కమింగ్ సీజన్ కోసం రిటెన్షన్ లిస్ట్ సబ్‌మిట్ చేయడానికి ఈ రోజు( నవంబర్ 15) సాయంత్రం తుది గడువు కగా.. ఫ్రాంచైజీలన్నీ ఆ పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే కొన్ని జట్లు ట్రేడ్ విండో ద్వారా ఇతర ఫ్రాంచైజీల ఆటగాళ్లను తీసుకోగా.. మరికొన్ని జట్లు అవసరం లేని ఆటగాళ్లను వేలంలోకి వదిలేసాయి.
ఇక డిసెంబర్ 23న కేరళలోని కొచ్చి వేదికగా ఐపీఎల్ 2023 మినీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. కరోనా రెండేళ్లు కొన్ని వేదికలకే పరిమితమైన ధనాధన్ లీగ్.. మళ్లీ పాత పద్దతిలో హోమ్ అండ్ అవే ఫార్మాట్‌లో అభిమానులను అలరించేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలు సైతం సత్తా కలిగిన ఆటగాళ్ల కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ సారి మినీ వేలంలో ప్రపంచకప్‌లో సత్తా చాటిన ఆటగాళ్లు భారీ ధర పలకనున్నారు.

సామ్ కరన్ కోసం..
ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన సామ్ కరన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డులను గెలుచుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు అవార్డ్స్ గెలుచుకున్న ఏకైక ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో 3 వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించిన సామ్ కరన్.. మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు.
ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని బౌలింగ్ ఎకానమీ అద్భుతంగా ఉండటం ఐపీఎల్ ఫ్రాంచైజీలను టెంప్ట్ చేస్తోంది. ఐపీఎల్ 2020, 2021 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సామ్ కరన్.. గాయం కారణంగా గతేడాది జరిగిన మెగా వేలంలో పాల్గొనలేదు.
దాంతో ఐపీఎల్ మినీ వేలంలో సామ్ కరన్ భారీ ధర పలికే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ముంబై, సన్‌రైజర్స్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, లక్నో, గుజరాత్ జట్లు అతని కోసం పోటీ పడే అవకాశం ఉంది.

బెన్ స్టోక్స్‌పై ఆర్‌సీబీ కన్ను..
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత పోరాటంతో ఇంగ్లండ్‌కు విజయాన్నందించిన బెన్ స్టోక్స్‌పై కూడా ఫ్రాంచైజీలు కన్నేసాయి. ఐపీఎల్ 2021 సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్‌కు స్టోక్స్ ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఐపీఎల్ 2022 ముందు రాజస్థాన్.. స్టోక్స్‌ను వదిలేయగా మానసిక సమస్యలతో అతను గత సీజన్‌కు దూరంగా ఉన్నాడు.
అప్‌కమింగ్ సీజన్ ఆడటంపై కూడా సందేహాలు నెలకొన్నా.. మినీ వేలానికి రిజిస్టర్ చేసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దాంతో ఫ్రాంచైజీలు స్టోక్స్‌ను దక్కించుకునేందుకు సమాయాత్తం అవుతున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్, ఆర్‌సీబీ స్టోక్స్ కోసం భారీ ధర చెల్లించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

కామెరూన్ గ్రీన్..
ఆస్ట్రేలియాకు చెందిన ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ప్రపంచకప్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినా.. ఫ్రాంచైజీలు ఆసక్తికనబరుస్తన్నాయి. ఎందుకంటే ప్రపంచకప్ ముందు భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గ్రీన్ విధ్వంసకర బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. గ్రీన్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ కావడంతో ఫ్రాంచైజీలు అతన్ని తీసుకోవాలని భావిస్తున్నాయి.

ఐర్లాండ్ ప్లేయర్ కోసం..
ఐర్లాండ్ ఆటగాడు జాషువా లిటిల్ ఈ ఏడాది ప్రపంచకప్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ కు ఈ యువ బౌలర్ సూపర్ -12 స్టేజీలో ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో లిటిల్ ప్రదర్శన అత్యద్భుతం. ఈ ఎడమచేతి వాటం బౌలర్ న్యూజిలాండ్ పై హ్యాట్రిక్ కూడా తీశాడు. దీంతో.. ఈ యంగ్ గన్‌పై ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications