న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గొప్ప పనికి శ్రీకారం చుట్టింది. 'గో గ్రీన్' కార్యక్రమంలో భాగంగా ఐపీఎల్ 2023 సీజన్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల్లో బౌలర్లు వేసే ప్రతీ డాట్ బాల్‌కు 500 మొక్కలు నాటుతామని ప్రకటించింది. క్వాలిఫయర్-1 నుంచి ఫైనల్ వరకు ఎన్ని డాట్ బాల్స్ పడితే అన్ని 500 మొక్కలు నాటనుంది.
ఈ క్రమంలోనే అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా డాట్ బాల్‌కు బదులు మొక్క సింబల్‌ను చూపించాయి. ముందుగా ఈ సింబల్‌ను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే బీసీసీఐ చేసే గొప్ప పని గురించి తెలుసుకొని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌తో బీసీసీఐ చేయనున్న ఈ గొప్ప పనిగురించి తెలిసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(44 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 60) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డెవాన్ కాన్వే(34 బంతుల్లో 4 ఫోర్లతో 40), రవీంద్ర జడేజా(16 బంతుల్లో 2 ఫోర్లతో 22) పర్వాలేదనిపించారు.
గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. దర్శన్ నల్కండే, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మోమిత్ శర్మ తలో వికెట్ తీసారు. గుజరాత్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో 34 డాట్ బాల్స్ వేసారు. ఈ లెక్కన బీసీసీఐ 17 వేల మొక్కలు నాటాల్సి ఉంటుంది. చెన్నై బౌలర్లు వేసే డాట్ బాల్స్‌తో పాటు బుధవారం జరిగే ముంబై-లక్నో ఎలిమినేటర్ మ్యాచ్, శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2, ఆదివారం జరిగే ఫైనల్లో వేసే డాట్ బాల్స్ అన్ని కలిస్తే సుమారు రెండు లక్షల మొక్కలను బీసీసీఐ నాటే అవకాశం ఉంది.

దాంతో పర్యావరణ అభిమానులు ఎక్కువ డాట్ బాల్స్ వేయాలని బౌలర్లను కోరుతున్నారు. గుజరాత్ బౌలర్లలో షమీ 10, దర్షన్ 9, రషీద్ ఖాన్ 5, నూర్ అహ్మద్ 6, మోహిత్ శర్మ 4 డాట్ బాల్స్ వేసారు. చెన్నై బౌలర్లు 9 ఓవర్లు ముగిసే సరికే 23 డాట్ బాల్స్ వేసారు.