న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన ఓ పనిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్.. ఈ సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. అతని స్థానంలో డేవిడ్ వార్నర్‌ను తాత్కలిక సారథిగా ఢిల్లీ క్యాపిటల్స్ నియమించింది. జట్టులో రిషభ్ పంత్ లేకపోవడం తాము జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపిన ఢిల్లీ ఫ్రాంచైజీ.. వీలైతే పంత్‌ను మ్యాచ్‌లు చూసేందుకు డగౌట్‌కి తీసుకొస్తామని ప్రకటించింది.
డ్రెస్సింగ్ రూమ్‌లో పంత్ చేసే హడావుడి మాములుగా ఉండదని, అతన్ని చాలా మిస్సవ్వబోతున్నామని లీగ్ ప్రారంభానికి ముందే ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. లక్నోతో జరిగిన తొలి మ్యాచ్‌కు పంత్ వచ్చే అవకాశం లేకపోవడంతో అతని జెర్సీ నె0 17ను ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్‌కు వేలాడదీసింది. అతను త్వరగా కోలుకోవాలని, బలంగా మైదానంలోకి తిరిగిరావాలని ఆకాంక్షించింది. అయితే ఈ పనిని బీసీసీఐ పెద్దలు తప్పుబట్టినట్లు తెలుస్తోంది.

మంచి ఉద్దేశంతోనే రిషభ్ పంత్ జెర్సీ వేలాడదీసినా.. అది మంచి పని కాదని బీసీసీఐ పెద్దలు చెప్పినట్లు ఓ ఐపీఎల్ ప్రతినిధి మీడియాకు తెలిపాడు. 'ఇది చాలా తీవ్రమైన చర్య. ఇలాంటివి అంతిమ విషాదం లేదా రిటైర్మెంట్ సమయంలోనూ చేస్తారు. ఇక్కడ రిషభ్ పంత్ బాగున్నాడు. అందరూ ఊహించినదానికంటే చాలా వేగంగా కోలుకుంటున్నాడు. మంచి ఉద్దేశంతోనే వారు అలా చేసినప్పటికీ.. భవిష్యత్‌లో మాత్రం పునరావృతం చేయవద్దు' అని బీసీసీఐ తెలిపినట్లు సదరు ఐపీఎల్ ప్రతినిధి పేర్కొన్నారు.
మరోవైపు నేడు(మంగళవారం) గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌కు రిషభ్ పంత్‌ను తీసుకొచ్చేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ భద్రతా, అవినీతి నిరోధక విభాగం నుంచి అనుమతి తీసుకున్నట్లు సమాచారం. 'ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో రిషభ్ పంత్ ఎప్పుడూ భాగమే. మంగళవారం గుజరాత్‌తో మ్యాచ్‌ను అతను డగౌట్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీసీసీఐ అనుమతిస్తే అతను డగౌట్‌లో భాగమవుతాడు' అని ఢిల్లీ ఫ్రాంచైజీ ప్రతినిధి ఒకరు తెలిపారు.