IPL 2023 మినీ వేలానికి రంగం సిద్దం.. ఎప్పుడంటే..?

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ నిర్వహణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కసరత్తులు చేస్తోంది. కరోనా కారణంగా గత మూడు సీజన్లుగా కళ తప్పిన ఐపీఎల్‌ను ఈ ఏడాది నుంచి మునపటి వైభవం సాధించే దిశగా ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు 2023 సీజన్ ను హోమ్ అండ్ అవే (ఇంటా బయటా) పద్ధతిలో నిర్వహించనున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గతంలోనే వెల్లడించాడు. తాజాగా ఈ సీజన్ కోసం బీసీసీఐ.. మినీ వేలం ప్రక్రియను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది.

డిసెంబర్‌లో మినీ వేలం..
ఐపీఎల్ 2023 సీజన్‌ను మార్చి చివరివారం నుంచి ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తున్నది. ఈ ఏడాది డిసెంబర్ 16న ఐపీఎల్ 2023 మినీ వేలం నిర్వహించనున్నది. గతేడాది మెగా వేలం నిర్వహించిన బెంగళూరులోనే మినీ వేలం కూడా నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఏజీఎంలో మినీ వేలం తేదీ ఖరారు చేయడంతో పాటు ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను రూ. 90 కోట్ల నుంచి రూ. 95 కోట్లకు పెంచనున్నారని సమాచారం.

ఏజీఎంలో తుది నిర్ణయం..
అక్టోబర్ 18న ముంబైలో నిర్వహించే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. మినీ వేలానికి సంబంధించి గతంలో బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. 'ఇది మినీ వేలం. గతేడాది నిర్వహించిందే మెగా వేలం. తర్వాత వచ్చే మూడేండ్లూ మినీ వేలాలే. ఫ్రాంచైజీలు తమ జట్లలో సర్దుబాట్లు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ఏడాది వేలం ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఏజీఎం తర్వాత తెలుస్తాయి..' అని చెప్పాడు.

హాట్ ఫేవరేట్‌గా జడేజా..
ఇక ఈసారి వేలంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్లేయర్ రవీంద్ర జడేజా. పదేళ్లుగా సీఎస్కేతో ఆడుతున్న జడ్డూ.. వచ్చే సీజన్ లో ఫ్రాంచైజీ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే జడేజా-సీఎస్కే మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఐపీఎల్-15లో అతడికి సారథ్యం కట్టబెట్టి మధ్యలోనే దాన్నుంచి తొలగించడంతో జడ్డూ కోపంగా ఉన్నాడు. దాంతో మినీ వేలంలో జడేజాకు భారీ ధర పలికే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications