ఆర్‌సీబీ మాట తప్పింది.. వేలంలో కొంటామని చెప్పి పట్టించుకోలేదు: యుజ్వేంద్ర చాహల్


ముంబై: టీమిండియా వెటరన్ స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ తన పాత ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ కనీసం పట్టించుకోలేదన్నాడు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ టీమ్‌లో ఉండేందుకు తాను ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసిన వార్తలు అవాస్తమని కొట్టిపారేశాడు. వేలంలో తనను కొంటామని చెప్పిన బెంగళూరు ఫ్రాంచైజీనే మాట తప్పిందన్నాడు.

అస్సలు డబ్బుల ప్రస్తావనే రాలేదు..
ఐపీఎల్‌లో ఆర్‌సీబీని వీడి మరో టీమ్‌కు ఆడుతానని అస్సలు ఊహించలేదని చహల్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'ఆర్‌సీబీతో ఎమోషనల్‌గా కలిసిపోయా. వేరే టీమ్‌కు ఆడాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీతో కలిసి ఉండేందుకు ఎక్కువ డబ్బులు ఎందుకు డిమాండ్ చేశావని సోషల్ మీడియాలో నన్ను చాలా మంది అడుగుతున్నారు. అది తప్పు. నేను అలా చేయలేదు. అసలు వేలానికి ముందు రిటెన్షన్ గురించి మేనేజ్ మెంట్ నాతో మాట్లాడలేదు.

నా కోసం ఒక్క బిడ్ వేయలేదు..
మా మధ్య డబ్బుల గురించి చర్చే జరగలేదు. అయితే, ఆర్‌సీబీ డైరెక్టర్ మైక్ హెసెన్ ఫోన్ చేసి ముగ్గురిని (కోహ్లీ, మ్యాక్స్‌వెల్, సిరాజ్) రిటైన్ చేసుకుంటున్నామని చెప్పారు. నన్ను వేలంలో తిరిగి కొనుగోలు చేస్తామని చెప్పాడు. కానీ, వాళ్లు నా కోసం ఒక్క బిడ్ కూడా వేయలేదు. నన్ను రిటైన్ చేసుకోండని ఫ్రాంచైజీని నేను అడగలేదు.. రిటైన్ చేసుకుంటామని వాళ్లూ చెప్పలేదు. ఒకవేళ నన్ను రిటైన్ చేసుకుంటామని అడిగితే కచ్చితంగా ఒప్పుకునేవాడిని.

ఆర్‌సీబీ అంటే చాలా ఇష్టం..
ఆర్‌సీబీతో అనుబంధమే నాకు ముఖ్యం. డబ్బు తర్వాతి విషయం. ఏదేమైనా నాకు మంచి ప్లాట్‌ఫామ్ ఇచ్చిన ఆర్‌సీబీతో పాటు ఆ టీమ్ ఫ్యాన్స్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు టీమ్ మారినా నా పెర్ఫామెన్స్ లో తేడా ఉండదు. ఇది నాకు కొత్త ప్రయాణం. బెంగళూరుకు ఎలాంటి పెర్ఫామెన్స్ చేశానో ఇప్పుడు రాజస్తాన్ కు అలాగే చేస్తా. ఏదీ మారదు. ఎందుకంటే వేలంలో రాజస్తాన్ రాయల్స్ నాపై నమ్మకముంచింది' అని చహల్ తెలిపాడు.

రూ.6.5 కోట్లు..
ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో చాహల్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసింది. చాహల్‌ను కాదని బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన వానిందు హసరంగాను ఆర్‌సీబీ రూ.10 కోట్లు భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక తనను తీసుకోకపోవడంపై విరాట్ కోహ్లీ ఏం మాట్లాడలేదని, రాజస్థాన్ రాయల్స్‌కు ఎంపికైనందుకు అభినందనలు తెలిపాడని చాహల్ చెప్పుకొచ్చాడు. ఓ కెప్టెన్‌గా విరాట్ తనకు పూర్తి స్వేచ్చనిచ్చాడని, నా ఎదుగుదలకు కృషి చేశాడని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications