
అహ్మదాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ ఘనంగా సన్మానించారు. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం నేపథ్యంలో సోమవారం గుజరాత్ ఆటగాళ్లు ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఓపెన్ టాప్ బస్‌పై ఊరేగిన గుజరాత్ ఆటగాళ్లకు అభిమానులు జేజేలు పలికారు. అభిమానులతో అహ్మదాబాద్ వీధులు కిక్కిరిసిపోయాయి.
ఉస్మాన్‌పురా రివర్ ఫ్రంట్ నుంచి బయలుదేరిన రోడ్ షో విశ్వకుంజ్ రివర్‌ఫ్రంట్ వద్ద ముగిసింది. జట్టు సారథి హార్దిక్ పాండ్యా, కోచ్ ఆశిష్ నెహ్రా, జట్టు సభ్యులు, సపోర్ట్ స్టాఫ్‌ను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ సత్కరించారు. ఐపీఎల్ ట్రోఫీని హార్దిక్ పాండ్యా పట్టుకుని అభిమానులకు చూపిస్తున్న వీడియోను శుభమన్ గిల్ షేర్ చేశాడు. ఈ రోడ్ షోకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ ఒకే మ్యాచ్ అడింది. స్టేడియంలో లక్షమంది ప్రేక్షకుల ముందు రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. కాగా, హోం ఫ్యాన్స్ ముందు ఆడి టైటిల్ గెలిచిన రెండో జట్టుగా గుజరాత్ టైటాన్స్ రికార్డులకెక్కింది. 2011లో చెన్నై సూపర్ కింగ్స్ సొంత అభిమానుల మధ్య జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (35 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, 'ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్' హార్దిక్ పాండ్యా (3/17) మూడు ప్రధాన వికెట్లతో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. అనంతరం గుజరాత్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్ గిల్ (43 బంతుల్లో 45 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.