Nicholas Pooran: ఈ రోజైన రూ.10.75 కోట్లకు న్యాయం చేస్తావా? శంకరన్న బాటలో నడుస్తావా?

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌ను ఘోర ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. క్యాష్ రిచ్ లీగ్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్‌తో నేడు(సోమవారం) అమీతుమీ తేల్చుకోనుంది. ముంబైలోని డీవై పాటిల్ మైదానం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడిన కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో.. రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించింది.
రాజస్థాన్ రాయల్స్‌తో పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్‌తో ఘోర ఓటమిని చవిచూసిన కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్.. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అయితే సన్‌రైజర్స్ అభిమానులంతా నికోలస్ పూరన్ అద్భుత ప్రదర్శన కోసం ఎదురు చూస్తున్నారు.

వేలంలో రూ.10.75 కోట్ల భారీ ధర..
మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను తీసుకోవాలనే ఉద్దేశంతో మార్క్యూ ప్లేయర్లకు కనీసం బిడ్ కూడా వేయని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్.. ముంబైతో పోటీపడలేక చివరకు అతనిని కొనుగోలు చేయలేకపోయింది. దాంతో సన్‌రైజర్స్‌కు జరగాల్సిన భారీ నష్టం జరిగింది.
ఇంగ్లండ్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో ఈ సీజన్ పూర్తిగా ఆడటంపై సందేహాలు ఉండటంతో అతన్ని వదిలేసిన సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్.. ఇతర జట్లతో పోటీపడి మరీ వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్‌ను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో పెద్దగా రికార్డు లేని పూరన్.. తనదైన రోజు ఒంటి చేత్తో ఫలితాన్ని శాసించగలడు. పైగా భారత్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగాడు.

ఫస్ట్ మ్యాచ్‌లోనే డకౌట్..
దాంతో ఈ విండీస్ విధ్వంసకర వీరుడిపై సన్‌రైజర్స్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లోనే ఈ విండీస్ వీరుడు డకౌట్‌గా వెనుదిరిగాడు. అతని దారుణ వైఫల్యం టీమ్ ఘోర పరాజయానికి కారణమైంది.
కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే పూరన్ తనదైన శైలిలో చెలరేగితే.. ఆ తర్వాత వచ్చే మార్కరమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్ ఎలాంటి ఒత్తిడి లేకుండా చెలరేగగలరు. కానీ పూరన్ వైఫల్యం వారిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. గత మ్యాచ్‌లో లొయారార్డర్ బ్యాట్స్‌మన్ మార్క్‌రమ్, సుంధర్ ఆడిన తీరును చూసిన తర్వాత టాపార్డ్ బ్యాట్స్‌మన్ రాణిస్తే.. సన్‌రైజర్స్ సులువుగా విజయం సాధించేదనిపించింది.

భారీ ధరకు న్యాయం చేయాలి..
ఈ క్రమంలోనే లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే రెండో మ్యాచ్‌లోనైనా నికోలస్ పూరన్ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. తన సామర్థ్యం మేరకు పూరన్ చెలరేగితే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు కనబడుతాయంటున్నారు. లక్నోతో రాణించి పూరన్.. తనకు చెల్లించిన భారీ ధరకు న్యాయం చేయాలని సూచిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో కూడా విఫలమైతే.. పూరన్‌ను మరో విజయ్ శంకర్‌లా భావించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా శంకర్ జట్టుతో కొనసాగి.. పేలవ ప్రదర్శనతో తమకు చికాకు తెప్పించాడని, అతనికి మనీశ్ పాండే కూడా తోడవ్వడంతో తమ బాధ రెట్టింపు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఇద్దరు లేరనుకుంటే..?
ఆ ఇద్దరిని వదిలేసి సన్‌రైజర్స్ మంచి పనిచేసిందని సంతోషపడుదామనుకుంటే.. పూరన్, అభిషేక్ శర్మలు వారిలానే తయారయ్యారని మండిపడుతున్నారు. ముఖ్యంగా పూరన్ డకౌట్లు జట్టును తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టుతాయంటున్నారు.
గతంలో పంజాబ్‌కు ఆడిన పూరన్.. ఒకటి రెండు ఇన్నింగ్స్‌లు మినహా పెద్దగా రాణించిందేం లేదు. దాంతో పంజాబ్ వరుస పరాజయాలు ఎదుర్కొంది. ఇప్పుడు సన్‌రైజర్స్‌కు ఆ పరిస్థితే వచ్చింది. కనీసం లక్నో మ్యాచ్‌లోనైనా ఫామ్ అందుకొని పూరన్.. తన సత్తాను నిరూపించుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. లేకుంటే జట్టులోకి మరో శంకర్ వచ్చాడని భావించాల్సి ఉంటుందంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications