పేలవ బ్యాటింగ్.. చెత్త కెప్టెన్సీ..
ఈ సీజన్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోను విఫలమవుతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో (41, 10, 3) 54 పరుగులే చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలో లైఫ్ లభించడంతో 41 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ వైఫల్యం జట్టు విజయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న రోహిత్.. ఆరంభంలోనే ఔటవుతుండటం ఇతర బ్యాట్స్‌మన్‌ను ఒత్తిడిలోకి నెట్టుతోంది. కేకేఆర్‌తో 3 పరుగులకే రోహిత్ ఔటవ్వడంతో ముంబై శుభారంభం అందుకోలేకపోయింది. దాంతో రోహిత్ బ్యాటింగ్ తీరుపై సొంత అభిమానులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రోహిత్ ఏమైందీ నీకు..
టీ20లో టెస్టు మ్యాచ్ ఆడిన ఘనత రోహిత్ శర్మకే చెల్లుతుందని ఘాటుగా విమర్శిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ అయ్యాకా హిట్‌మ్యాన్‌పై ఒత్తిడి పెరిగిందని, అది ఐపీఎల్‌లోనూ కంటిన్యూ చేస్తున్నాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు రోహిత్‌కు ఏమైందని, ఎందుకిలా ఆడుతున్నాడని సందేహిస్తున్నారు. స్వేచ్చగా ఆడలేకపోతున్నాడని చెబుతున్నారు. కెప్టెన్సీ కూడా మునపటిలా లేదని, హెట్‌మైర్‌కు పొలార్డ్‌తో బౌలింగ్ చేయించడం, కమిన్స్‌కు డానియల్ సామ్స్‌తో బౌలింగ్ వేయించడం రోహిత్ శర్మ చేసిన ఘోర తప్పిదమంటున్నారు.
దమ్ముంటే ఇప్పుడు గెలువు
రోహిత్ ఘోర వైఫల్యమే అదునుగా భావించిన విరాట్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఐదు టైటిళ్లు గెలిచిన రోహిత్ శర్మకు హ్యాట్రిక్ పరాజయాలా? అంటూ సెటైరికల్‌గా పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుత జట్టుతో టైటిల్ కొట్టాలని రోహిత్ శర్మకు ఆర్‌సీబీ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సవాల్ విసురుతున్నారు. ఆ ఐదు టైటిళ్లు రోహిత్ శర్మ ఒక్కడివల్ల రాలేదని, బలమైన జట్టుతోనే సాధ్యమయ్యాయని చురకలంటిస్తున్నారు. గత సీజన్ వరకు ముంబైకి చాలా బలమైన జట్టు ఉందని, ఈ సారి వేలంలో వారు సరైన ఆటగాళ్లను తీసుకోలేకపోయారని దాంతో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. సరైన టీమ్ లేకుంటే ఏ కెప్టెన్ కూడా ఏం చేయలేడని, అనవసరంగా విరాట్ కోహ్లీపై అసత్య ప్రచారం చేసి కెప్టెన్సీ నుంచి తప్పుకునేలా చేశారని మండిపడుతున్నారు.
కమిన్స్ కమాల్ ఇన్నింగ్స్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ ( 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) అర్ధశతకంతో సత్తాచాటాడు. తిలక్ వర్మ ( 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్), పొలార్డ్ ( 5 బంతుల్లో 3 సిక్స్‌లతో 22 నాటౌట్) రాణించారు. కమిన్స్ (2/49) రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో కోల్‌కతా 5 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. కమిన్స్ ( 15 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56 నాటౌట్) వీరవిహారం చేశాడు. వెంకటేశ్ అయ్యర్ ( 41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మురుగన్ అశ్విన్ (2/25), మిల్స్ (2/38) ఆకట్టుకున్నారు.


Click it and Unblock the Notifications
