
పుణే: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన వికెట్ విషయంలో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం ప్రకటించాడనే అసహనంతో మైదానం వీడాడు. ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(36 బంతుల్లో 5 ఫోర్లతో 48).. యువ ప్లేయర్ అనూజ్ రావత్(47 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66)తో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా 2 పరుగుల వ్యవధిలో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు.
అసలేం జరిగిదంటే..?
ఐపీఎల్‌లో బేబీ ఏబీ(డెవాల్డ్ బ్రేవిస్) వేసిన తొలి ఓవర్ తొలి బంతికే విరాట్ కోహ్లీ ఎల్బీగా వెనుదిరిగాడు. బేబీ ఏబీ వేసిన 19 ఓవర్ తొలి బంతి వికెట్ల మీదకు దూసుకు రాగా.. విరాట్ కోహ్లీ డిఫెండ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్, ప్యాడ్‌ను తాకింది. దాంతో ముంబై ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. బంతి బ్యాట్‌కు తాకిందనే కాన్ఫిడెన్స్‌తో విరాట్ కోహ్లీ వెంటనే రివ్యూ తీసుకున్నాడు.
బ్యాట్, ప్యాడ్‌ను ఒకేసారి..
రిప్లేలో పలు కోణాల్లో థర్డ్ అంపైర్ పరిశీలించగా.. బంతి బ్యాట్‌కు తగిలి ప్యాడ్‌ను తాకినట్లు ఒక యాంగిల్‌లో కనిపించింది. మరో కోణంలో బ్యాట్, ప్యాడ్‌ను ఒకేసారి తాకినట్లు కనిపించింది. థర్డ్ అంపైర్ సైతం బంతి.. ప్యాడ్, బ్యాట్‌కు ఒకేసారి తాకిందన్నాడు. ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు కాబట్టి తాను బాల్ ట్రాకింగ్‌ను చెక్ చేస్తున్నానని థర్డ్ అంపైర్ తెలిపాడు. బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను హిట్ చేయడంతో ఔట్‌గా ప్రకటించాడు. అయితే ముందుగా బ్యాట్‌కు తాకినట్లు స్పష్టంగా తెలుస్తున్నా? ఔట్ ఎలా ఇస్తారని విరాట్ అసహనం వ్యక్తం చేశాడు. తీవ్ర అసంతృప్తితోనే మైదానం వీడాడు.
సూర్య సూపర్..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 151 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్).. రోహిత్ శర్మ(26), ఇషాన్ కిషన్(26) ఫర్వాలేదనిపించారు. 79 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ముంబైని.. జయదేవ్ ఉనాద్కత్(13 నాటౌట్)తో కలిసి సూర్య 7వ వికెట్‌కు అజేయంగా 72 పరుగులు జోడించాడు. బెంగళూరు బౌలర్లలో వానిందు హసరంగా, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ ఓ వికెట్ పడగొట్టాడు.
మ్యాక్సీ.. తనదైన శైలిలో...
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ.. అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్‌తో 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 152 పరుగులు చేసి 9 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. చివర్లో అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్(2 బంతుల్లో సిక్స్‌తో 7 నాటౌట్), గ్లేన్ మ్యాక్స్‌వెల్(2 బంతుల్లో 2 ఫోర్లతో 8 నాటౌట్) మ్యాచ్‌ను ముంగిచేసారు.