టైటిల్ విన్నర్ శంకరన్నా...
సీజన్ ఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో అవకాశం ఇవ్వగా.. విజయ్ శంకర్ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. అటు బౌలింగ్‌లోనూ నిరాశపరిచాడు. దాంతో గుజరాత్ మేనేజ్‌మెంట్ అతన్ని పక్కనపెట్టింది. మళ్లీ ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. కానీ టీమ్ వరుస విజయాలతో దూసుకెళ్లింది. టేబుల్ టాపర్‌గా నిలిచి నాకౌట్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను రెండు సార్లు చిత్తుగా ఓడించి తొలి టైటిల్‌ను ముద్దాడింది. అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్ గెలిచిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. అయితే జట్టులో ఉన్న కారణంగా విజయ శంకర్ కూడా ఐపీఎల్ చాంపియన్ అయ్యాడు.
లక్ స్టార్ శంకర్..
ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌లకు కూడా ఐపీఎల్ ట్రోఫీ అందుకోవడం సాధ్యం కాలేదని, కానీ మా శంకరన్న టైటిల్ గెలిచాడని సెటైర్లు పేల్చుతున్నారు. వచ్చే సీజన్‌లో ఆటను మెరుగుపరుచుకొని రావాలని సూచిస్తున్నారు. శంకర్ వల్లే గుజరాత్‌కు లక్ కలిసొచ్చిందని, సన్‌రైజర్స్‌లో ఉంటే టైటిల్ గెలిచేదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వచ్చే సీజన్‌లో కూడా ఆరంభ మ్యాచ్‌ల్లో శంకరన్నకు అవకాశం దక్కుతుందని, కానీ అతను మాత్రం తనదైన శైలిలోని విఫలమై జట్టులో చోటు కోల్పోతాడని కామెంట్ చేస్తున్నారు.
సన్‌రైజర్స్‌తో జోకర్‌గా..
గత సీజన్‌లో శంకర్ చెత్తాట కారణంగా గెలిచే మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమిపాలైంది. 10-12 పరుగులు చేస్తే గెలవాల్సిన స్థితిలో కూడా విజయ్ శంకర్ ఏం చేయలేకపోయాడు. దాంతో అతనిపై అభిమానులు తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్నారు. ఎన్ని అవకాశాలు వచ్చినా అతను సత్తా చాటకపోవడంతో శంకర్‌ను జోకర్‌లా చూస్తున్నారు. తెలుగు తేజం అంబటి రాయుడిని కాదని త్రీడీ ప్లేయరంటూ శంకర్‌ను ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. అతను దారుణంగా విఫలమవడంతో శంకర్‌పై వ్యతిరేకత మరీ ఎక్కువైంది.


Click it and Unblock the Notifications
