
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గావస్కర్.. మాటల్లో పెట్టి కోహినూర్ డైమండ్‌ను బ్రిటీష్ వాళ్లు ఎత్తుకెళ్లారనే విషయాన్ని ప్రస్తావించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే.. ఆదివారం వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన సునీల్ గావస్కర్... భారత ప్రజలు ఇప్పటికీ కోహినూర్ డైమండ్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపాడు. మ్యాచ్ విరామ సమయంలో అధికార బ్రాడ్‌కాస్టర్ స్టేడియం పక్కనే ఉన్న మెరైన్ డ్రైవ్‌ను ఏరియల్ వ్యూ ద్వారా చూపించగా.. దానికి 'క్వీన్స్ నెక్లెస్' అనే పేరుందని చెప్పాడు.
ఈ క్రమంలోనే పక్కనే ఉన్న ఇంగ్లీష్ కామెంటేటర్ అలన్ విల్కిన్స్‌తో సన్నీ సరదాగా సంభాషించాడు. 'మేమింకా కోహినూర్ వజ్రం కోసం ఎదురుచూస్తున్నాం' అని అన్నాడు. దీంతో ఇద్దరూ నవ్వుకొని సంబరపడ్డారు. అనంతరం విల్కిన్స్ అందుకొని.. 'గావస్కర్ ఈ మాటలు అంటాడని నాకు తెలుసు' అని బదులిచ్చాడు. తిరిగి గావస్కర్ అందుకొని.. 'మీకు ఏమైనా ప్రత్యేక పలుకుబడి ఉంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడిగి కోహినూర్ డైమండ్‌ను తిరిగి భారత్‌కు ఇవ్వమని చెప్పండి' అని సున్నితమైన హాస్యం జోడించాడు.
కాగా, భారత్‌కు చెందిన అత్యంత విలువైన కోహినూర్ డైమండ్ ప్రస్తుతం బ్రిటిష్ రాణి కిరీటంలో పొదిగి ఉన్న సంగతి తెలిసిందే. అయితే, గావస్కర్ కోహినూర్‌పై సరదాగా చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. దీంతో అతను విల్కిన్స్‌ను ఆ డైమండ్ గురించి అడగడం బాగుందని పలువురు నెటిజన్లు గవాస్కర్‌ను ప్రశంసిస్తున్నారు. నవ్వుతూనే ఇంగ్లీష్ వాళ్లను దొంగలను చేశాడని మెచ్చుకుంటున్నారు.