
హైదరాబాద్: ఎన్నో అంచనాల మధ్య 10 జట్లతో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకోలేకపోతోంది. తొలి వారం ఐపీఎల్ రేటింగ్స్ దారుణంగా పడిపోగా... రెండో వారం కూడా ఆకట్టుకోలేకపోయింది. ప్రేక్షకులు పెద్దగా ఐపీఎల్‌ను పట్టించుకోవడం లేదు. అటు టీవీల్లో.. ఇటు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లోనూ మ్యాచ్‌లను చూసే వారి సంఖ్య గతంతో పోలిస్తే చాలా తగ్గింది. ఈ ఊహించని పరిణామం స్టార్ ఇండియాకు తీవ్రని నష్టం తెచ్చేలా ఉంది. ఈ సీజన్‌కు యాడ్స్ రేట్లను స్టార్ ఇండియా 25 శాతం పెంచినా.. గతేడాది ఆదరణ నేపథ్యంలో కంపెనీలు ఎగబడ్డాయి. కానీ ఈ సారి ప్రేక్షకాదరణ తగ్గడంతో స్టార్ ఇండియాపై గగ్గోలు పెడుతున్నాయి.
ఇది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి కూడా తీవ్రని నష్టం తెచ్చేలా ఉంది. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ అమ్మకం ద్వారా రూ.35-40 వేల కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీసీసీఐకి తాజా టీఆర్‌పీ రేటింగ్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా రెండు వారాలు రేటింగ్స్ పడిపోవడంతో బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ విషయంలో ఆయా కంపెనీల ఆసక్తి తగ్గే అవకాశం ఉంది.
గతేడాదితో పోలిస్తే తొలి వారం టీఆర్‌పీ టీఆర్‌పీ రేటింగ్స్ ఏకంగా 33 శాతం తగ్గిపోగా.. వ్యూయర్ షిప్ 14 శాతం పడిపోయింది. రెండో వారంలో టీఆర్‌పీ రేటింగ్స్ 28 శాతం తగ్గిపోయింది. బార్క్ ఇండియా లెక్కల ప్రకారం గతేడాది తొలి వారంలో ఐపీఎల్ 2022 సీజన్ టీఆర్‌పీ రేటింగ్ 3.75గా ఉండగా.. ఈ సారి అది 2.52కి పడిపోయింది. ఆన్‌లైన్ వేదికగా వ్యూయర్‌షిప్ గతేడాది ఐపీఎల్ ప్రారంభమైన తొలి వారంలో 267.7 మిలయన్స్ వ్యూస్ రాగా.. ఈ సారి ఆ సంఖ్య 229.06 మిలియన్స్‌కు పడిపోయింది. రెండో వారంలో కూడా వ్యూస్ తగ్గాయి.
వ్యూయర్‌షిప్, టీఆర్‌పీ రేటింగ్స్ పడిపోవడానికి అనేక కారణాలున్నాయి. దేశంలో నెలకొన్న పరిస్థితులు వ్యూయర్‌షిప్‌పై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. తొలి వారంలో RRR మూవీ దెబ్బకొడితే.. ఇప్పుడు కేజీఎఫ్ పార్ట్ 2 ప్రభావం చూపింది. దానికి తోడు ముంబై ఇండియన్స్ ఘోర వైఫల్యం కూడా రేటింగ్స్‌ను దెబ్బతీసింది.