
ప్లే ఆఫ్స్ చేరితే వండరే..
బ్యాటింగ్ కోచ్ గా వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా, పేస్ బౌలింగ్ కోచ్ గా సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ ను తీసుకుని అంచనాలు పెంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... మెగా వేలంలో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ ఏడాదైనా బలమైన కొత్త ప్లేయర్లతో బరిలో నిలుస్తారనుకున్న ఫ్యాన్స్ ఆశల్ని అడియాశలు చేసింది. ఎప్పట్లానే కేవలం బౌలర్లపైనే ఫోకస్ చేసిన ఆరెంజ్ ఆర్మీ మరోసారి బలహీన బ్యాటింగ్ లైనప్‌తో పోటీపడనుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయం ఫ్యాన్స్‌ను మరింత కలవరపెడుతోంది. కేన్ ఇప్పటికే ముంబై చేరుకున్నా.. తను అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండేది అనుమానమే. అతనితో పాటు భువీ, నటరాజన్‌లు సైతం గాయాలతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో సన్‌రైజర్స్ టైటిల్ గెలవడం దేవుడెరుగు.. ప్లే ఆఫ్స్ చేరినా అద్భుతమే.

బలాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలం ఎవరా? అంటే ఇటీవల సూపర్ ఫామ్ లో కనిపిస్తున్న వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్. భారత్‌తో జరిగిన సిరీస్ లో మూడు హాఫ్ సెంచరీలతో మెరిసిన పూరన్.. లీగ్ లోనూ అదే ఫామ్ కొనసాగించాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. టాపార్డర్ లో మార్‌క్రమ్, రాహుల్ త్రిపాఠి రూపంలో మంచి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. వేలానికి ముందు రిటైన్ చేసుకున్న యంగ్ క్రికెటర్ అబ్దుల్ సమద్ తో పాటు బిగ్ హిట్టింగ్ ఆల్ రౌండర్ షెఫర్డ్ ఫినిషర్ పాత్ర పోషిస్తే టీమ్ కు తిరుగుండదు. బౌలింగ్ లో 140 కి.మీ. వేగంతో బాల్స్ వేసే చేసే కార్తీక్ త్యాగి, ఉమ్రాన్ అక్మల్ అవతలి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలరు. ఇక వాషింగ్టన్ సుందర్ రూపంలో మంచి స్పిన్ ఆప్షన్ ఉండనే ఉంది.

బలహీనతలు
సన్‌రైజర్స్ పేపర్‌పై బలంగానే కనపడుతున్నా బరిలో దిగితే తప్ప వారి పెర్ఫామెన్స్ ను అంచనా వేయలేం. భారత పిచ్ లపై ప్రత్యర్థి బ్యాటర్లను శాసించే స్పిన్ విభాగంలో ఈ టీమ్ వీక్ గా కనిపిస్తోంది. సుందర్ తప్ప మరో రెగ్యులర్ స్పిన్నర్ లేకపోవడం పెద్ద లోటు. రషీద్ ఖాన్ లాంటి టాప్ స్పిన్నర్ ను వదులుకున్న ఫ్రాంచైజీ ఆ స్థాయి ప్లేయర్‌ను కొనుగోలు చేయలేకపోయింది. శ్రేయస్ గోపాల్, జగదీశ్ సుచిత్, అభిషేక్ శర్మ టీమ్ లో ఉన్నా.. వారి పెర్ఫామెన్స్ పై నమ్మకం ఉంచలేం. ఇక సీనియర్ పేసర్ భువనేశ్వర్ తో పాటు యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ ఫిట్‌నెస్ టీమ్‌కు పెద్ద సమస్య. ఫారిన్ పేసర్లు షెఫర్డ్, జాన్సెన్, అబాట్ ఏ మాత్రం రాణిస్తారో చెప్పలేం. పైగా, విలియమ్సన్, పూరన్, మార్‌క్రమ్ తుది జట్టులో ఉంటే ఫారిన్ కోటాలో మరొకరికి మాత్రమే చాన్సుంటుంది. మిడిలార్డర్ లో అభిషేక్, సమద్, గార్గ్ లాంటి డొమెస్టిక్ ప్లేయర్లపై నమ్మకం ఉంచలేం.

సన్ రైజర్స్ టీమ్
భారత ఆటగాళ్లు: రాహుల్ త్రిపాఠి, జగదీశ్ సుచిత్, శ్రేయస్ గోపాల్, కార్తీక్ త్యాగి, నటరాజన్, భువనేశ్వర్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ప్రియమ్ గార్గ్, విష్ణు వినోద్, ఉమ్రన్ మాలిక్, శశాంక్ సింగ్, ఆర్. సమర్థ్, సౌరభ్ దూబే,
ఫారిన్ ప్లేయర్లు: విలియమ్సన్ (కెప్టెన్), మార్‌క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, నికోలస్ పూరన్, రొమారియో షెఫర్డ్, ఫజల్ ఫరూకి, మార్కో జాన్సెన్, సీన్ అబాట్
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, రొమారియో షేఫర్డ్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్/కార్తీక్ త్యాగీ


Click it and Unblock the Notifications













