
ముంబై: సీజన్ మారినా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన మారలేదు. పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్‌తో ఆరెంజ్ ఆర్మీ.. ఐపీఎల్ 2022 సీజన్‌ను ఘోర పరాజయంతో ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమై 61 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ స్టార్ పేసర్, యార్కర్ల స్పెషలిస్ట్ నటరాజన్ సైతం ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. చివర్లో వికెట్ తీసినా.. దారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఒకప్పటిలా కచ్చితమైన యార్కర్లు సంధించలేకపోయాడు.
ఇక మ్యాచ్ అనంతరం నటరాజన్.. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్, శ్రీలంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగాతో ముచ్చటించాడు. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇద్దరూ యార్కర్లు విసరడంలో స్పెషలిస్టులు కావడంతో ఈ ఫొటో ఇంట్రస్టింగ్‌గా మారింది. మలింగాతో మాట్లాడిన నట్టూ.. బౌలింగ్ మెళుకువలు తీసుకున్నాడు. టెక్నిక్‌గా యార్కర్లు ఎలా వేయాలి.. డెత్ ఓవర్స్‌లో బ్యాటర్లను ఎలా కంట్రోల్ చేయాలి అనే దానిపై డీప్‌గా చర్చించాడు.
వైరల్ అయిన ఫొటోను గమనిస్తే.. బాల్ ఎలా రిలీజ్ చేయాలి అనే దానిపై మలింగా నట్టూకి టెక్నిక్స్ చెబుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో విఫలమైనా.. ఏప్రిల్ 4వ తేదీన లక్నోతో జరిగే మ్యాచ్‌లోనైనా మంచి బౌలింగ్ చేయాలనే దృఢ నిశ్చయంతో నటరాజన్ ఉన్నట్లు అర్థమవుతోంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో యార్కర్లతో అందరి దృష్టిని ఆకర్షించిన నటరాజన్ భారత్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. అయితే అతనికి మొకాలి గాయం కావడంతో రిథమ్ కోల్పోయాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ శాంసన్(27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55), దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) విధ్వంసం సృష్టించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్ రెండేసి వికెట్లు తీయగా.. భువీ, రోమియో తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(14 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), రొమారియో(18 బంతుల్లో 2 సిక్స్‌లతో 24)మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.