

హైదరాబాద్: విజిల్ పొడు, ఈ సాల కప్ నమ్దే, కొర్బో లొర్బో జీత్‌బో, సద్దా పంజాబ్, హల్లా బోల్.. ఇలా ఐపీఎల్‌లోని చాలా ఫ్రాంచైజీలు తాము ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్రాల భాషల్లోని క్యాచీ స్లోగన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఐపీఎల్‌లోకి ఏంట్రీ ఇచ్చి ఏళ్లు గడిచినా సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఆ దిశగా ఆలోచించలేకపోయింది. గత సీజన్ వైఫల్యం, తన ఆటతో ఫ్రాంచైజీకే వన్నె తెచ్చి టైటిల్ అందించిన సారథి డేవిడ్ వార్నర్‌ను అవమానకర రీతిలో తప్పించడం, మెగా వేలంలో స్టార్లను కాదని అనామక ఆటగాళ్లపై కోట్లు తగలేసి అభిమానుల ఆగ్రహానికి గురైన సన్‌రైజర్స్ తమ తప్పులను దిద్దుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడిప్పుడే తెలుగు భాషకు, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తోంది.
సోషల్ మీడియా వేదికగా తెలుగులోనే పోస్ట్‌లు పెట్టడం ప్రారంభించింది. తెలుగులోని అప్‌కమింగ్ మూవీల ప్రమోషన్స్‌లోనూ పాలుపంచుకుంటుంది. టాలీవుడ్ హీరోలకు సంబంధించిన పాటలు, డైలాగ్స్ చెప్పిస్తూ అభిమానులను ఆకట్టుకేనే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇంకా జట్టుకు కావాల్సిన అసలు సిసలు తెలుగు ట్యాగ్‌లైన్ మాత్రం ప్రకటించలేకపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ విజిల్ పొడు.. ఆర్‌సీబీ ఈ సాల కప్ నమ్దే ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కానీ తెలుగు రాష్ట్రాలకు చెందిన సన్‌రైజర్స్ హైదరాబాద్ గోగోగో ఆరెంజ్ ఆర్మీ అనే ఇంగ్లీష్ ట్యాగ్‌లైన్‌తో ఆరంభంలో సందడి చేసినా ఇప్పుడూ ఆరెంజ్ ఆర్మీ అనే ట్యాగ్‌కే పరిమితమైంది. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్‌కు అసలు సిసలు తెలుగు ట్యాగ్ లైన్ ఉండాలని ఆ జట్టు అభిమానులు ఎన్నో ఎళ్లుగా కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎన్నో విజ్ఞప్తులు చేశారు. అయినా సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ పట్టించుకోకపోవడంతో వారే ఓ ట్యాగ్‌లైన్ ఎంపిక చేశారు.
సోషల్ మీడియా వేదికగా ఎన్నో చర్చల తర్వాత 'మనల్ని ఎవడ్రా ఆపేది'అనే తెలుగు ట్యాగ్‌లైన్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీకి తెలిసేలా సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది సూపర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్ మూవీ భీమ్లా నాయక్‌లోని డైలాగ్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున దీనికి మద్దతు తెలుపుతున్నారు.
ప్రముఖ తెలుగు కామెంటేటర్, క్రికెట్ అనలిస్ట్ సీ వెంకటేశ్ ఈ క్యాంపైన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఎన్నో ఏళ్లు ఈ విషయంపై అతను సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తున్నారు. చివరకు ఆయనే కొన్ని ఆప్షన్స్ ఇచ్చి అభిమానుల అభిప్రాయాలను కోరారు. చాలా మంది 'మనల్ని ఎవడ్రా ఆపేది'అనేదానికి ఓటేయడంతో దాన్నే సన్‌రైజర్స్ ట్యాగ్‌లైన్‌గా ప్రకటించారు. పుష్ప సినిమాలోని ట్రేడ్ మార్క్ డైలాగ్ 'తగ్గేదేలే'ను చాలా మంది సూచించినా.. అది కామన్ అయిపోతుందనే అభిప్రాయం వ్యక్తమైంది.