
హైదరాబాద్: గత మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శనతో చెన్నైని ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అదే జోరును కొనసాగిస్తూ మరో విజయాన్ని అందుకుంది. తొలి మూడు మ్యాచ్‌లలో గెలిచి అజేయంగా నిలిచిన గుజరాత్ టైటాన్స్‌ను దెబ్బ తీసి మరో రెండు కీలక పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. సోమవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ 8 వికెట్ల తేడాతో టైటాన్స్‌పై విజయం సాధించింది. సీజన్‌లో కొత్త జట్టయిన గుజరాత్‌కు ఇదే తొలి ఓటమి. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా సన్‌రైజర్స్ ఏకంగా 22 అదనపు పరుగులు (ఎక్స్‌ట్రాలు) సమర్పించుకుంది. ఇందులో 20 వైడ్‌లు ఉన్నాయి. దాంతో అత్యధిక వైడ్స్ వేసిన రెండో జట్టుగా సన్‌రైజర్స్ అప్రతిష్టను మూటగట్టుకుంది. భువనేశ్వర్ కుమార్ ఒక్కడే 12 వైడ్స్ వేయగా.. ఉమ్రాన్ మాలిక్ 5, మార్కో జాన్సెన్ 2, నటరాజన్ ఓ వైడ్ వేసాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒకసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఇంతకంటే ఎక్కువ వైడ్‌లు (21) ఇచ్చింది. ఈ సీజన్‌లోనే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తమ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ 21 వైడ్‌లు వేసింది. ఇందులో మహమ్మద్ సిరాజ్ ఒక్కడే 14 వైడ్స్ వేసాడు. తాజా మ్యాచ్‌తో భువీ.. సిరాజ్ తర్వాత అత్యధిక వైడ్స్ వేసిన బౌలర్‌గా నిలిచాడు.

ఓవరాల్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ వేసిన 28 ఎక్స్‌ట్రాలే ఇప్పటి వరకు అత్యధికంగా ఉన్నాయి. 2008లో డెక్కన్ చార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఈ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఆ తర్వాత 27 ఎక్స్‌ట్రాలతో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్(26), చెన్నై సూపర్ కింగ్స్(26) ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (42 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 50 నాటౌట్) అర్ధ సెంచరీ చేయగా, అభినవ్ మనోహర్ (21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) రాణించాడు. అనంతరం హైదరాబాద్ 19.1 ఓవర్లలో 2 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ విలియమ్సన్ (46 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు 57) హాఫ్ సెంచరీ సాధించగా, అభిషేక్ శర్మ (32 బంతుల్లో 6 ఫోర్లతో 42), పూరన్ (18 బంతు ల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 నాటౌట్) మెరిశారు.