
బెంగళూరు: ఐపీఎల్ 2022 సీజన్‌కు సమయం దగ్గరపడుతున్నా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఇంకా తమ నాయకుడెవరో చెప్పలేదు. ఇన్నాళ్లు జట్టును నడిపించిన విరాట్ కోహ్లీ గత సీజన్‌తోనే సారథ్య బాధ్యతలు వదులుకోవడంతో కొత్త కెప్టెన్‌ను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఆర్‌సీబీకి ఏర్పడింది. సారథి లేకుండానే మెగా వేలంలో పాల్గొన్న ఆర్‌సీబీ.. కీలక ఆటగాళ్లనే కొనుగోలు చేసింది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా వేధిస్తున్న సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. అయితే లీగ్‌లోని అన్ని జట్లు తమ సారథులను ప్రకటించగా.. ఆర్‌సీబీ మాత్రం ఇంకా సమాలోచనలు చేస్తోంది.
మళ్లీ విరాట్ కోహ్లీనే సారథ్య బాధ్యతలు చేపట్టేలా అతన్ని బుజ్జగించే ప్రయత్నం చేసిన ఆర్‌సీబీ కెప్టెన్సీ ప్రకటనలో కాలాయపన చేస్తూ వచ్చింది. ఎంతకీ విరాట్ కోహ్లీ అంగీకరించకపోవడంతో ప్రత్యామ్నాయ ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. ముందు జాగ్రత్తగా వేలంలోనే కెప్టెన్సీ ఆప్షన్స్ కలిగిన ఆటగాళ్లను తీసుకున్న ఆర్‌సీబీ.. తమ నాయకుడి పేరును ప్రకటించేందుకు బెంగళూరు వేదికగా ఓ పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ మేరకు ఆ జట్టు తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.
కొత్త కెప్టెన్‌తో ఆర్‌సీబీ కొత్త శకం మొదలవ్వనుందని, తమ నూతన సారథి ఎవరో తెలియాలంటే మార్చి 12న బెంగళూరులోని చర్చస్ట్రీట్, మ్యూజియమ్ క్రాస్‌రోడ్‌లో నిర్వహించే ఆర్‌సీబీ అన్ బాక్స్ ఈవెంట్‌కు రావాలని పేర్కొంది. ఈ కార్యక్రమంలోనే ఆర్‌సీబీ తమ కెప్టెన్‌ను ప్రకటించనుంది. తాజా ట్వీట్‌తో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగడనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ రేసులో ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌తో పాటు దినేశ్ కార్తీక్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దినేశ్ కార్తీక్, ఫాప్ డుప్లెసిస్‌లో ఒకరు సారథ్యం చెపట్టే అవకాశం ఉంది.
ఇక ఆర్‌సీబీ అన్‌బాక్స్ కార్యక్రమానికి అందరూ రావచ్చని, ఎలాంటి పాస్‌లు, పరిమిత సంఖ్య లేదని ఆ ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ట్విటర్ వేదికగా పంచుకుంది. అప్ కమింగ్ సీజన్‌కు సంబంధించిన జెర్సీని కూడా ఈ కార్యక్రమంలోనే ఆవిష్కరించనున్నారు.