
ముంబై: జట్టులో నెలకొన్న విపత్కర పరిస్థితులను తమ ఓటములకు సాకుగా చెప్పమని ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్ 91 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఢిల్లీ జట్టులో మళ్లీ కరోనా కలకలం రేగగా.. పలువురు ఆటగాళ్లు అనారోగ్యానికి గురయ్యారు. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రిషభ్ పంత్.. అప్పడప్పుడూ ఇలాంటి ఘోర పరాజయాలు ఎదురవ్వడం సహజమేనని తెలిపాడు. అయితే దురదృష్టం కొద్ది అది ఈ మ్యాచ్‌లోనే జరిగిందని చెప్పాడు. చెన్నై జట్టు అన్ని విభాగాల్లో రాణించిందని, తమని చిత్తుచిత్తుగా ఓడించిందన్నాడు.
'ఈ సీజన్‌లో మేం కొన్ని మ్యాచ్‌ల్లో విజయం ముంగిట బోర్లాపడ్డాం. అయితే అప్పుడప్పుడూ భారీ తేడాతో పరాజయాలు కూడా ఎదురవుతాయి. దురదృష్టంకొద్దీ మేం ఈ రోజు అలాంటి ఓటమివైపు నిలిచాం. కొద్ది రోజులుగా మా జట్టు మెరుగవుతోందని అనుకున్నాం. కానీ, అది నిజం కాదని ఈ మ్యాచ్‌తో తెలిసిపోయింది. ఇక మిగిలిన 3 మ్యాచ్‌ల్లో మేం విజయాలు సాధిస్తేనే ప్లేఆఫ్స్‌కు వెళతామనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

అలాగే మా జట్టులో పరిస్థితులు కూడా అంత బాగోలేవు. కరోనా కేసులతో పాటు పలువురు ఆటగాళ్లు అనారోగ్యంతో ఉన్నారు. ఇవన్నీ మా ఓటములకు కారణాలుగా చెప్పట్లేదు. ఇకపై మా ఆటగాళ్లు సానుకూల దృక్పథంతో ఉండేలా చూసుకోవాలి. మిగిలిన మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగాలి'అని పంత్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 87) భారీ ఇన్నింగ్స్ ఆడగా.. ధోనీ (8 బంతుల్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో 21 నాటౌట్) సూపర్ ఫినిష్ అందించాడు. ఈ ఇద్దరి విధ్వంసానికి తోడుగా రుతురాజ్ గైక్వాడ్(33 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 41), శివమ్ దూబే(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ మూడు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ మార్ష్‌కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ.. 17.4 ఓవర్లలో 117 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. మిచెల్ మార్ష్(25), రిషభ్ పంత్(21), శార్దూల్ ఠాకూర్(24), డేవిడ్ వార్నర్(19) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లలో మోయిన్ అలీ మూడు వికెట్లు తీయగా.. ముఖేష్ చౌదరి, సిమర్జీత్ సింగ్, డ్వేన్ బ్రావో రెండేసి వికెట్లు తీసారు. మహీశ్ తీక్షణ ఓ వికెట్ పడగొట్టాడు.