IPL 2022 Retention Rules: పాత జట్లు నలుగుర్ని రిటైన్ చేసుకోవచ్చు.. కొత్త టీమ్స్ ముగ్గుర్ని ఎంచుకోవచ్చు!

ముంబై: ఐపీఎల్‌ను పది జట్ల విస్తృతి కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన ప్రయత్నం సూపర్ సక్సెస్ అయింది. కొత్తగా వచ్చిన రెండు జట్లతో బోర్డు పంట పండింది. అక్షరాల రూ. 12,715 కోట్ల ఆదాయం వచ్చి చేరింది. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని భారత కార్పొరేట్ సంస్థ గోయెంకా గ్రూప్(ఆర్‌పీఎస్‌జీ) రూ.7,090 కోట్లకు, లక్నో టీమ్‌ను అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ (ఐరిలియా కంపెనీ లిమిటెడ్) రూ. 5,625 కోట్లు కుమ్మరించి దక్కించుకున్నాయి.
గత సోమవారమే కొత్త జట్ల వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఇక కొత్త టీమ్స్ కోసం టెండర్ ప్రక్రియ ముగియడంతో బోర్డు ఇప్పుడు మెగా వేలం ఏర్పాట్లకు సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీని పూర్తి చేసే పనిలో పడింది. బోర్డు రూపొందించిన ఈ పాలసీకి సంబంధించిన వివరాలను ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ ఓ కథనంలో వెల్లడించింది.

నలుగురికి చాన్స్..
ప్రస్తుతానికి మెగావేలం తేదీలను ఖారారు చేయకపోయినప్పటికీ ఆటగాళ్ల రిటెన్షన్‌పై బోర్డు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పాలసీ ప్రకారం మెగా వేలానికి ముందు పాత జట్లు నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో ముగ్గురు భారత ఆటగాళ్లు, ఒక ఓవర్ సీస్ ప్లేయర్ లేదా ఇద్దరు భారత ప్లేయర్లు.. ఇద్దరు ఓవర్ సీస్ ప్లేయర్లను ఎంచుకోవచ్చు. ఇక భారత ఆటగాళ్ల విషయంలో క్యాప్, అన్ క్యాప్ ప్లేయర్లా? అనేది ఫ్రాంచైజీల ఇష్టం. మొత్తం క్యాప్ ప్లేయర్లను లేదా అన్ క్యాప్ ప్లేయర్లను, కలిపి కూడా తీసుకోవచ్చు.

కొత్త టీమ్స్ ముగ్గుర్నే..
ఇక కొత్తగా వచ్చిన రెండు జట్లు మాత్రం పాత జట్లు వదిలేసిన ఆటగాళ్లు, మెగా వేలానికి అందుబాటులో ఉన్న ప్లేయర్ల పూల్ నుంచి నేరుగా ముగ్గురిని ఎంచుకోవచ్చు. ఆటగాళ్లతో సంప్రదింపులు జరిపి ఈ ముగ్గురిని నియమించుకునే అవకాశం ఉంది. ఈ ప్రాసెస్ ముగిసిన తర్వాతే మిగిలిన ఆటగాళ్లతో మెగా వేలం జరగనుంది. ఇప్పటికే ఈ రిటెన్షన్ పాలసీ గురించి ఫ్రాంచైజీలతో ఐపీఎల్ నిర్వాహకులు చర్చలు జరపారని సమాచారం. టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే బీసీసీఐ ఈ పాలసీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపారు.

రైట్ కార్ట్స్ లేవ్..
ఇక జట్ల పర్స్ వాల్యూను కూడా రూ. 90 కోట్లకు పెంచనున్నారు. ఈ సీజన్ నిర్వహించిన మినీ వేలంలోని రూ.85 కోట్ల కన్నా కొంచెం ఎక్కువ. ఇక 2018 మెగా వేలం మాదిరి ఈసారి రైట్ టు కార్డ్‌లు ఉండవు. ఇక కొత్త జట్లు తీసుకునే ముగ్గురు ఆటగాళ్లలో ఇద్దరు భారత ఆటగాళ్లతో పాటు ఓ ఓవర్‌సీస్ ప్లేయర్ ఉండాలి. అయితే రిటైన్ చేసుకునే ఆటగాళ్ల విషయంలో తుది నిర్ణయం ప్లేయర్‌దే. ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నా అతనికి వేలంలోకి వెళ్లాలని ఉంటే వెళ్లవచ్చు. అతనికి ఆ ఫ్రాంచైజీతో ఉండటం ఇష్టం లేకపోయినా లేదా? వేలంలోకి వెళ్తే మెరుగైన ధర లభిస్తుందని భావించినా అతను వెళ్లవచ్చు.
ప్రస్తుతానికి ఈ రిటెన్షన్ పాలసీ సంబంధించిన వివరాలను ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించకపోయినా.. రిటైన్ ప్లేయర్ల విషయంలో ఫ్రాంచైజీలకు నవంబర్ డెడ్‌లైన్‌గా తెలుస్తోంది. ఆలోపు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ పాలసీ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా రిటైన్ చేసుకునే ఆటగాళ్ల ధరలను, పర్స్ మనీ పర్సెంటేజ్ విషయంలో కండీషన్స్ పెట్టే అవకాశం ఉంది.

రిటైన్ ఆటగాళ్ల ధరల విషయంలో..
2018 మెగావేలం సమయంలో పర్స్ మనీ రూ.80 కోట్లు ఉండగా.. రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు రూ.33 కోట్లే చెల్లించాలనే కండిషన్ బోర్డు పెట్టింది. అప్పుడు టీమ్స్ మొత్తం ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ముగ్గురిని నేరుగా తీసుకుంటే మరో ఇద్దరిని రైట్ టూ మ్యాచ్ కార్డ్ కింద అంటిపెట్టుకున్నాయి.
అయితే ఈసారి అదే నిబంధన పెడితే ఫ్రాంచైజీలకు కష్టాలు తప్పవు. ఆ లెక్కన ముగ్గురి ఆటగాళ్లను తీసుకోవాలంటే వారికి వరసగా రూ.15 కోట్లు, రూ.11 కోట్లు, రూ. 7 కోట్లు చెల్లించవల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఆర్‌సీబీ విరాట్ కోహ్లీకి రూ.17 కోట్లు చెల్లిస్తుంది. కాబట్టి బిగ్ ప్లేయర్లను తీసుకోవాలంటే ఫ్రాంచైజీలు తమ రిటైన్ ప్లేయర్ల సంఖ్యను తగ్గించుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications