IPL 2022 Retention: మొదలైన ముసుగులో గుద్దులాట! లక్నోపై సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్ ఫిర్యాదు!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం దగ్గర పడుతుండటంతో ఫ్రాంచైజీల మధ్య నిశబ్ధయుద్దానికి తెరలేచింది. ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునే పరిస్థితికి దారి తీసింది. ఐపీఎల్ విస్తరించాలనే లక్ష్యంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కొత్తగా రెండు జట్లను తీసుకురావడంతో మేగా వేలం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కొత్త జట్ల ప్రక్రియను పూర్తి చేసిన భారత క్రికెట్ బోర్డు భారీ ధరకు రెండు ఫ్రాంచైజీ హక్కులను కట్టబెట్టింది.
అహ్మదాబాద్ బేస్ ఫ్రాంచైజీని సీవీసి క్యాపిటల్స్ రూ.5625 కోట్లుకు దక్కించుకోగా.. లక్నో బేస్ టీమ్‌ను రూ. 7090 కోట్లకు ఆర్‌పీఎస్‌జీ సొంతం చేసుకుంది. కొత్త జట్ల ఎంపిక కూడా పూర్తవ్వడంతో మెగా వేలం నిర్వహణపై బీసీసీఐ దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీని సిద్దం చేసి ఫ్రాంచైజీలకు అందజేసింది. నవంబర్ 30లోపు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించాలని ఆదేశించింది.

రిటెన్షన్ నిబంధనలు ..
బీసీసీఐ రూపొందించిన రిటెన్షన్ రూల్స్ ప్రకారం పాత ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరేసి భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. జీత భత్యాల్లో కూడా రూల్స్ పాటించాలి.
నలుగురిని రిటైన్ చేసుకుంటే తొలి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 12 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ. 8 కోట్లు, నాలుగో ప్లేయర్‌కు రూ.6 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన ఫ్రాంచైజీలు రూ.90 కోట్ల తమ పర్స్ వాల్యూ నుంచి రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది. ఈ రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిన ఆటగాళ్ల నుంచి కొత్త జట్లు 'పిక్ అప్'ఆప్షన్ కింద ముగ్గురిని ఎంచుకోవచ్చు.

కేఎల్ రాహుల్‌కు లక్నో గాలం..
ఇక రిటెన్షన్ జాబితాలో ఉండాలా? లేక వేలంలోకి వెళ్లాలా? అనే విషయంపై ఆటగాళ్లదే తుది నిర్ణయమని బీసీసీఐ తెలపడంతో కొత్త జట్లు తమ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ముఖ్యంగా భారీ ధరకు లక్నో ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న లక్నో నిబంధనలకు వ్యతిరేకంగా ఆటగాళ్లతో సంప్రదింపులు జరుపుతుందనే ప్రచారం జరుగుతోంది.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌లతో సంప్రదింపులు జరిపి భారీ మొత్తంలో నగదు చెల్లిస్తామని ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఐపీఎల్ నిబంధనలకు ఇది వ్యతిరేకం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

లక్నోపై ఫిర్యాదులు వచ్చాయి..
కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్ తమ ఫ్రాంచైజీలను వీడేలా లక్నో అనైతిక చర్యలకు పాల్పడుతుందని పంజాబ్, హైదరాబాద్ బీసీసీఐ దృష్టికి తీసుకొచ్చాయని బోర్డుకు చెందిన ఓ అధికారి కూడా తెలిపాడు. అయితే అధికారికంగా ఫిర్యాదు చేయలేదన్నాడు. 'లెటర్ ద్వారా ఎలాంటి ఫిర్యాదు అందుకోలేదు కానీ నోటి మాట ద్వారా లక్నో టీమ్ తమ ఆటగాళ్లకు గాలం వేస్తుందని పాత ఫ్రాంచైజీలు మా దృష్టికి తీసుకు వచ్చాయి.
మేం దీనిపై దృష్టిసారించాం. వారు అనైతిక చర్యలకు పాల్పడ్డారని నిరూపితమైతే నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటాం. తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ ఇలా చేయడం ఏ మాత్రం భావ్యం కాదు'అని సదరు అధికారి ఇన్‌సైడ్ స్పోర్ట్ వెబ్‌సైట్‌కు తెలిపాడు.

బేరాల్లేవమ్మా..
పంజాబ్ కింగ్స్ జట్టులో కొనసాగలేనని కేఎల్ రాహుల్ ఆ ఫ్రాంచైజీకి స్పష్టం చేసినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. టీమ్ పెర్ఫామెన్స్ నచ్చకనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అయితే రాహుల్‌కు రూ.20 కోట్లు ఆశచూపించి లక్నో అలా చెప్పించిందని పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు రషీద్ ఖాన్ తనను ఫస్ట్ స్లాబ్ ప్లేయర్‌గా (రూ.16 లేదా రూ.14 కోట్లు) రిటైన్ చేసుకోవాలనే కండీషన్ పెట్టాడని, బేరాల్లేవి లేవని సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు స్పష్టం చేసినట్లు ఆ ఫ్రాంచైజీ వర్గాలు పేర్కొన్నాయి.
తాము సెకండ్ స్లాబ్ ప్లేయర్‌గా రూ.12 కోట్లు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పాయి. కానీ దీనికి రషీద్ ఒప్పుకోవడం లేదని, దీనికి కారణం లక్నోనే అని ఆరోపిస్తున్నాయి. మొన్నటి వరకు రాహుల్ రూ.11 కోట్లు తీసుకోగా.. రషీద్ ఖాన్ రూ.9 కోట్ల వేతనాన్ని అందుకున్నాడు.

అప్పట్లో జడేజాపై నిషేధం..
రిటెన్షన్ ప్రక్రియ ముగిసేవరకు ఆయా జట్లలోని ఆటగాళ్లు ఇతర ఫ్రాంచైజీలతో చర్చలు జరపడం నిబంధనలకు వ్యతిరేకం. రిటెన్షన్ ప్రక్రియ ముగిసే వరకు సదరు ఆటగాళ్లంతా ఆయా టీమ్స్ కాంట్రాక్టులో ఉన్నట్లే. 2010లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్న రవీంద్ర జడేజా ఇలా ఇతర ఫ్రాంచైజీలతో మాట్లాడి నిషేదానికి గురయ్యాడు. ఫుల్ బాల్ లీగ్స్‌లో కూడా ఇలాంటి ఆరోపణలు తరుచూ వినిపిస్తూనే ఉంటాయి.
ఇప్పుడు క్రికెట్‌కు కూడా ఇది విస్తరించింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చేయాలంటే.. ఆటగాళ్లతో పాటు ఫ్రాంచైజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదని, గతంలో కూడా జరగాయని ఓ ఫ్రాంచైజీకి చెందిన అధికారి తెలిపాడు. ఇలాంటివి పునరావృతం కాకుండా బీసీసీఐ కఠిన గైడ్‌లైన్ జారీ చేయాలని ఆయన సూచించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications