IPL 2022: మ్యాక్స్‌వెల్ ‘షూటౌట్’తో మ్యాచ్ టర్నింగ్.. జడేజా ఫైరింగ్ గన్ సెలెబ్రేషన్స్ వైరల్!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా తొలి విజయాన్నందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా.. ప్లేయర్‌గా కూడా దుమ్మురేపాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన చెన్నై 23 పరుగులతో తొలి విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో జడేజా(3/39) బ్యాటింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయినా.. బౌలింగ్‌లో సత్తా చాటాడు. మూడు కీలక వికెట్లతో ఆర్‌సీబీ పతనాన్నిశాసించాడు. ముఖ్యంగా ఆర్‌సీబీ డేంజరస్ బ్యాట్స్‌మన్ గ్లేన్ మ్యాక్స్‌వెల్(11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌తో 26)ను స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
ఫైరింగ్ గన్ సెలెబ్రేషన్స్..
ఈ వికెట్ అనంతరం చేతిని గన్‌లా పెట్టి షూట్ చేసినట్లు జడేజా సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జడేజా ఫైరింగ్ గన్ సెలెబ్రేషన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి ఆర్‌సీబీ 20 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితిల్లో క్రీజులోకి వచ్చి మ్యాక్స్‌వెల్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. మ్యాక్సీ క్రీజులో కుదురుకోవడంతో ఆర్‌సీబీ విజయం ఖాయమని అంతా భావించారు.

మ్యాచ్ టర్నింగ్ పాయింట్..
కానీ జడేజా తన ఏడో ఓవర్‌లో మ్యాక్స్‌ని ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఆ ఓవర్‌లో అతను వేసిన చివరి బంతిని షార్ట్ బాల్‌గా భావించి బ్యాక్‌ఫుట్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన మ్యాక్సీ.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతి తక్కువ ఎత్తులో వేగంగా దూసుకొచ్చి వికెట్లను గిరాటేసింది. దాంతో జడేజా సంతోషానికి హద్దే లేకుండా పోయింది.
మ్యాక్సీ నిరాశగా పెవిలియన్ చేరగా.. జడేజా ఫైరింగ్ గన్ స్టైల్లో సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వానిందు హసరంగాను క్యాచ్ ఔట్ చేసిన జడేజా.. అంబటి రాయుడు స్టన్నింగ్ క్యాచ్‌తో ఆకాశ్ దీప్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నాడు. మ్యాక్సీ వికెట్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అతను గనుక ఔటవ్వకపోయుంటే ఆర్‌సీబీ..కార్తీక్ సాయంతో సునాయసంగా గెలిచేది.

చెన్నై షురూ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. శివమ్ దూబె ( 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 నాటౌట్), రాబిన్ ఉతప్ప ( 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 88) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. అనంతరం బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసింది.
షాబాజ్ అహ్మద్( 27 బంతుల్లో 4 ఫోర్లతో 41), సూయాశ్ ప్రభుదేశాయ్ ( 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34), దినేశ్ కార్తీక్ ( 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34) రాణించారు. ఛేదనలో చకచకా నాలుగు వికెట్లు పడ్డా బెంగళూరు పోరాడింది. తీక్షణ (4/33), జడేజా (3/39) బెంగళూరును దెబ్బతీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications