
న్యూఢిల్లీ: ఆసియా కప్ ఫైనల్లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ఐదు నిమిషాల ముందు మహేంద్రసింగ్ ధోనీ ఫుట్‌బాల్ ఆడటం చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యానని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. పట్టరాని కోపంతో అతనిపై ఎన్నడు లేనంతగా ఆడటం ఆపేయాలని అరిచానని గుర్తు చేసుకున్నాడు.
ఇక ధోనీకి ఫుట్‌బాల్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు అతను క్రికెట్‌లోకి రాకముందు ఫుట్‌బాల్ మీదే ఎక్కువ ధ్యాస పెట్టాడు. అనుకోని పరిస్థితుల్లో క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
ఐపీఎల్ 2022 సీజన్‌లో హిందీ కామెంటేటర్‌గా సేవలందిస్తున్న రవిశాస్త్రి.. ధోనీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనను గుర్తు చేసుకున్నాడు.'ధోనీకి ఫుట్‌బాల్ ఆడటమంటే చాలా ఇష్టం. అతడు ఆడే తీరు చూస్తే మనకు భయమేస్తుంది. అంత ఇంటెన్సిటీతో ఆడతాడు. మహీ అలా ఆడుతుంటే పొరపాటున గాయాలబారిన పడితే ఎలా..? ఒకసారి ఆసియాకప్ ఫైనల్లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు టాస్ వేసే ఐదు నిమిషాల ముందు మైదానంలో ఫుట్‌బాల్ ఆడుతున్నాడు.
దాంతో నాకు కోపం వచ్చి గట్టిగా అరిచాను. నా జీవితంలో అలా ఎప్పుడూ అరవలేదు. ఎవరైనా కీలక మ్యాచ్‌కు ముందు తమ అత్యుత్తమ ఆటగాడు గాయాలపాలవ్వాలని అనుకోరు కదా.. అందుకే.. ఫుట్‌బాల్ ఆడటం ఆపేయాలని అరిచేశాను. అయితే, అతన్ని ఫుట్‌బాల్‌కు దూరం చెయ్యడం చాలా కష్టమైంది' అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2022లో రవీంద్ర జడేజాను తమ కెప్టెన్‌గా నియమించి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తప్పు చేసిందని రవిశాస్త్రి అన్నాడు. జడేజాకు బదులుగా సౌతాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లిసెస్‌ను జట్టులో ఉంచుకుని అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాల్సిందని అభిప్రాయపడ్డాడు. అసలు డుప్లిసెస్‌ను సీఎస్‌కే వదులుకుని ఉండాల్సింది కాదన్నాడు. అప్పుడు జడేజాపై ఎలాంటి ఒత్తిడి ఉండేది కాదని, తన సహజసిద్ధమైన ఆటను ఆడే వాడని చెప్పాడు. ఇలా చేసి ఉంటే ప్రస్తుతం ఐపీఎల్ 2022లో చెన్నైసూపర్ కింగ్స్ పరిస్థితి మరోలా ఉండేదని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.