
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌కు ఇంకా 10 రోజుల సమయమే ఉండటంతో జట్లన్నీ ఒక్కొక్కటిగా ముంబై నగరానికి చేరుకుంటున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ సారి లీగ్‌ను మహరాష్ట్రకే పరిమితం చేసిన విషయం తెలిసిందే. వాంఖడే, డీవై పాటిల్, పుణే మైదానల్లోనే లీగ్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఫైనల్‌తో పాటు ప్లే ఆఫ్స్‌ను అహమ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి.
ముంబై తరహా పిచ్‌లు కలిగిన సూరత్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం చెన్నైలో క్యాంపు ఏర్పాటు చేసింది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లు కూడా ముంబైకి చేరుకున్నారు. కెప్టెన్ సంజూ శాంసన్‌తో పాటు ఈ సారి వేలం ద్వారా కొత్తగా జట్టులోకి వచ్చిన యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ, దేవ్‌దత్ పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణ, కరుణ్ నాయర్ తదితర ఆటగాళ్లకు రాజస్థాన్ జట్టు యాజమాన్యం సంప్రదాయ రీతిలో స్వాగతం పలికింది. ఆ ఫొటోలను ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కూడా.. నవీ ముంబయి సమీపంలోని 'రిలయన్స్ జియో' స్టేడియంలో ప్రాక్టీస్ ప్రారంభించింది. తొలి రోజు ట్రెయినింగ్‌లో భాగంగా ముంబై జట్టు డైరెక్టర్ జహీర్ ఖాన్, కోచ్ మహేల జయవర్ధనె నేతృత్వంలో ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌పై అనాలిసిస్ చేశారు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో చేరారు. మరోవైపు, ఇన్నాళ్లు బెంగళూరులోని ఎన్సీఏ రిహాబిలిటేషన్ క్యాంపులో ఉన్న యువ ఆటగాడు ఇషాన్ కిషన్ పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించి జట్టుకి అందుబాటులోకి వచ్చాడు. మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కోల్‌కతా, చెన్నైతో వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ సీజన్‌కు తెరలేవనుంది.