
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ తమ బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక దిగ్గజ బౌలర్, ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ లసిత్ మలింగాను నియమించుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం సోషల్ మీడియా వేదికగా రాజస్థాన్ రాయల్స్ ప్రకటించింది. టీ20 క్రికెట్‌లో అత్యంత గొప్ప బౌలర్ అయిన మలింగా.. తాను ఆడే రోజుల్లో బ్యాట్స్‌మన్‌ను వణికించాడు. ముంబై ఇండియన్స్ టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2019 ఐపీఎల్ ఫైనల్లో చివరి బంతికి రెండు పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసి చిరస్మరణీయ విజయాన్నందించాడు. 122 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 170 వికెట్లు పడగొట్టాడు. లీగ్ ఇంత ఘన చరిత్ర ఉన్న మలింగా రాజస్థాన్ రాయల్స్ సపోర్ట్ స్టాఫ్‌లో చేరడం ఆ జట్టుకు కలిసిరానుంది.
ఇక మలింగాను రాజస్థాన్ తమదైన శైలిలో స్వాగతం పలికింది. ట్విటర్ వేదికగా కిస్సెస్ ద బాల్.. లసిత్ మలింగా.. పింక్ అంటూ రాసుకొచ్చింది. ఇప్పటికే టీమ్ డైరెక్టర్ శ్రీలంక దిగ్గజ ప్లేయర్ కుమార సంగక్కర కొనసాగుతున్నాడు. అతని చొరవతోనే మలింగాకు ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.
మెగా వేలం పుణ్యమా ఈసారి ఆర్‌ఆర్‌గా బలంగా కనిపిస్తోంది. వేలంలో అదరగొట్టిన రాజస్థాన్ సత్తా కలిగిన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ప్రతీ సీజన్ వేలంలో ఏదో ఒక తప్పు చేసే రాజస్థాన్ ఈ సారి మాత్రం అద్భుతమైన ఆటగాళ్లను తీసుకుంది. సంజూ శాంసన్(రూ.14 కోట్లు), జోస్ బట్లర్(రూ.10 కోట్లు), యశస్వీ జైస్వాల్(రూ.4 కోట్లు) ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకోవడంతో రూ.62 కోట్ల భారీ పర్స్ మనీతో వేలంలో పాల్గొన్నది. దాంతోనే తమకు కావాల్సిన ఆటగాళ్లను తీసుకోగలిగింది.
ఫించ్ హిట్టర్ షిమ్రాన్ హెట్‌మైర్, సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ వాన్ డర్ డస్సెన్, న్యూజిలాండ్ సెన్సేషన్ డారిల్ మిచెల్‌ను రాజస్థాన్ కొనుగోలు చేసింది. ఈ ఆటగాళ్లందరినీ తమ బడ్జెట్‌లోను తీసుకోవడం విశేషం. ఐపీఎల్‌లో హెట్‌మైర్‌కు మంచి అనుభవం ఉండగా.. డారిల్ మిచెల్ టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటాడు. అంతేకాకుండా స్లోయర్ బౌన్సర్ స్పెషలిస్ట్ అయిన ఓబే మొకాయ్, స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, పేస్ ఆల్‌రౌండర్స్ జిమ్మీ నీషమ్, నాథన్ కౌల్టర్ నైల్‌లను తీసుకుంది. ముంబై ఇండియన్స్‌కు చెందిన ముగ్గురు పాత ప్లేయర్లను రాజస్థాన్ కొనుగోలు చేయడం విశేషం. గత కొన్నేళ్లుగా తమను ఇబ్బంది పెట్టిన స్పిన్ విభాగాన్ని ఈసారి బలంగా మార్చింది. భారత సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌లను అగ్గువకే కొనుగోలు చేసింది. దేవదత్ పడిక్కల్‌తో పాటు తమ పాత ప్లేయర్ రియాన్ పరాగ్‌లను కూడా తెలివిగా దక్కించుకుంది.