
బెంగళూరు: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్పిన్నర్ రాహుల్ చాహర్ కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. ముఖ్యంగా పంజాబ్, రాజస్థాన్ హోరీహోరీగా తలపడ్డాయి. అయితే బిడ్డింగ్ జరుగుతుండగా ఆక్షనీర్ చారు శర్మపై పంజాబ్ కింగ్స్ ఓనర్ నెస్ వాడియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉద్దేశపూర్వకంగానే బిడ్డింగ్‌ను ఆలస్యం చేస్తున్నావని అసహనం వ్యక్తం చేశాడు. ఆక్షనర్‌ను తన సైగలతో నిలదీసాడు. ఇక దీనికి చారు శర్మ కూడా బదులిచ్చే ప్రయత్నం చేశాడు.
రాహుల్ చాహర్ కోసం ముందుగా ఆసక్తి కనబర్చని ఫ్రాంచైజీలు.. పంజాబ్ కింగ్స్ బిడ్డింగ్ స్టార్ట్ చేయగానే రేసులోకి వచ్చాయి. ధర పెంచాలనే లక్ష్యంతోనే బిడ్ చేశాయి. రూ. 3 కోట్ల బిడ్డింగ్ తర్వాత ఫ్రాంచైజీలు స్పందించలేదు. అయితే ఆక్షనర్ మాత్రం బిడ్డింగ్‌ను ముగించకుండా చెప్పిందే చెబుతూ రిపీట్ చేశాడు. దాంతో రాహుల్ చాహర్ ధర రూ.4.80 కోట్లకు చేరింది. అయినా కూడా చారు శర్మ బిడ్డింగ్ ముగించలేదు. దాంతో తీవ్ర అసహనానికి గురైన నెస్ వాడియా ఆక్షనీర్‌పై గుస్సా అయ్యాడు. దాంతో అతనికి చారు శర్మ సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. రాజస్థాన్ రాయల్స్ టైమ్ కోరిందని చెప్పాడు. చివరకు పంజాబ్ కింగ్స్ రూ. 5.25 కోట్ల భారీ ధరకు రాహుల్ శర్మను కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2022 సీజన్ కోసం నియమించిన ఆక్షన్ హగ్ హెడ్మెడెస్ అస్వస్థతకు గురవ్వడంతో అతని స్థానంలో టాప్ కామెంటేటర్ అయిన చారు శర్మ ఆక్షనర్ బాధ్యతలు నిర్వర్తించాడు. వానిందు హసరంగా కోసం ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుండగా ఆక్షనర్ కిందపడిపోయాడు. దాంతో మెగా వేలాన్ని తాత్కలికంగా నిలిపివేసారు. అదే సమయంలో మధ్యాహ్న భోజన విరామాన్ని తీసుకున్నారు. ఎడ్మెడెస్ కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణం.. హైపోటెన్షన్ అని తేలింది. పోస్టురల్ హైపోటెన్షన్ వల్ల ఎడ్మెడెస్ అస్వస్థతకు గురయ్యాడని డాక్టర్లు నిర్ధారించారు.
తొలుత గుండెపోటు అనే ప్రచారం సాగినప్పటికీ..కారణం అది కాదని డాక్టర్లు స్పష్టం చేశారు. ఆయనకు హోటల్‌లోనే చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విశ్రాంతి తీసుకుంటే సాధారణ స్థితికి చేరుకుంటుందని పేర్కొన్నారు. భోజన విరామం అనంతరం చారు శర్మ ఎంట్రీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం.. 3:30 గంటలకు వేలంపాట ఆరంభం కావాల్సి ఉన్నప్పటికీ.. కొంత ఆలస్యమైంది. 3:45కు పునఃప్రారంభమైంది.