PBKS vs CSK: అందుకే సెఫ్టీ షీల్డ్‌తో రిషి ధావన్ బౌలింగ్!

ముంబై: ఆరేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భారత దేశవాళీ క్రికెటర్ రిషి ధావన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. 2016లో ఇదే పంజాబ్ తరఫున చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన రిషి ధావన్ ఇన్నాళ్లకు మళ్లీ అవకాశం అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రిషి ధావన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ బౌలింగ్‌లో అదరగొట్టాడు. అయితే హెడ్ మాస్క్ లాంటి సెఫ్టీ షీల్డ్ ధరించి రిషి ధావన్ బౌలింగ్ చేయడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన ఫోటోస్ ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అందుకే సెఫ్టీ హెడ్ మాస్క్..
ఇటీవలే గాయం నుంచి కోలుకొని వచ్చిన రిషి ధావన్.. బ్యాటర్ కొట్టే షాట్స్ తగిలినా ఏం కాకూడదు అనే ఉద్దేశంతో ఈ హెడ్ మాస్క్‌ను ధరించాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన రిషి ధావన్ సెకండాఫ్ టోర్నీలో తీవ్రంగా గాయపడ్డాడు. బ్యాటర్ కొట్టిన షాట్ నేరుగా అతని ముక్కుకు తగలడంతో ఆసుపత్రిపాలయ్యాడు. వైద్యులు అతని ముక్కుకు సర్జరీ చేశారు. ఈ సర్జరీ కారణంగానే రిషి ధావన్ ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందే పంజాబ్ జట్టుకు అందుబాటులోకి వచ్చిన అతను.. నెట్స్‌లో కూడా హెడ్ మాస్క్ ధరించే బౌలింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను పంజాబ్ కింగ్స్ ట్వీట్ చేసింది. ఈ వీడియోలో తన గైర్హాజరీకి గల కారణాన్ని రిషి ధావన్ వెల్లడించాడు.
హెడ్ మాస్క్‌తో బౌలింగ్ తొలిసారి..
గ్లాస్ లాంటి దానితో తయారు చేసిన ఈ హెడ్ మాస్క్ తల, ముక్కు వంటి బాగాలను కవర్ చేస్తోంది. బంతి వేగంగా వచ్చి బౌలర్ కు తగిలినా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇది నివారించే అవకాశం ఉంది. అయితే భారత్‌లో ఒక బౌలర్ హెడ్ మాస్క్ వాడటం ఇదే తొలి సారి. కానీ.. వేరే దేశాల్లో ఇటువంటి మాస్క్ లతో పలువురు ఆటగాళ్లు బౌలింగ్ చేశారు. 2018లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన దేశవాళీ టోర్నీలో వారెన్ ఇటువంటి మాస్క్ నే ధరించి బౌలింగ్ చేశాడు.
బౌలర్లకు రక్షణగా..
ఇక ఇటువంటి హెడ్ మాస్క్‌లు ఎక్కువగా ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ క్రీడల్లో కనిపిస్తాయి. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్ ఫిలిప్ హ్యూజ్ మరణం తర్వాత అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు తమ రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు. బ్యాటర్లకు హెల్మెంట్ ఉంటుంది కానీ, బౌలర్లు మాత్రం ఎటువంటి రక్షణ లేకుండానే బౌలింగ్ చేస్తారు. ఒకవేళ బ్యాటర్ స్ట్రయిట్ గా కొట్టిన సమయంలో దాదాపు 100 కుపైగా కి.మీ వేగంతో బంతి వచ్చి బౌలర్ ను తగిలే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో అనుకోనిది ఏదైనా జరిగితే అతడి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications