
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో విజయాన్నందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ చేజేతులా చేజార్చుకుంది. ముఖ్యంగా మార్కస్ స్టోయినీస్ అత్యుత్సాహం ఆ జట్టు ఓటమిని శాసించింది.
చివర్లో ధాటిగా ఆడుదామనుకున్న అతని ప్రణాళిక బెడిసికొట్టింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసింది.ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(64 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 96) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. లక్నో బౌలర్లలో దుష్మంత్ చమీరా, జాసన్ హోల్డర్ రెండేసి వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్(24 బంతుల్లో 3 ఫోర్లతో సిక్స్‌తో 30), కృనాల్ పాండ్యా(28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) మినహా అంతా విఫలమయ్యారు. ముఖ్యంగా మార్కస్ స్టోయినిస్ వైఫల్యం జట్టు పతనాన్ని శాసించింది. 36 పరుగుల్లో 72 పరుగులు అవసరమైనప్పుడు క్రీజులోకి వచ్చిన స్టోయినీస్.. నిదానంగా ఆడాడు. 12 బంతుల్లో 34 పరుగులు అవసరమైన సమయంలో హజెల్ వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అయితే అంపైర్ తప్పిదం అతను ఔటవ్వడానికి దారి తీసింది. హజెల్ వుడ్ వేసిన తొలి బంతిని అంపైర్ వైడ్‌గా ప్రకటించకపోవడంతో అసహనానికి గురైన స్టోయినీస్ మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో లక్నో ఓటమి ఖాయమైంది. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(4/25) నాలుగు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ రెండు, మ్యాక్సీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది.