
ముంబై: జీవితంలో కొన్ని సార్లు పొరపాటున చేసిన చిన్న చిన్న తప్పిదాలు కూడా భారీ నష్టాన్ని మిగులుస్తాయి. పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ ఒడియన్ స్మిత్‌ది అదే పరిస్థితి. ఓవర్ త్రో రూపంలో అతను ఇచ్చిన ఒక్క పరుగులు స్మిత్ జీవితాంతం వెంటాడనుంది. అంతేకాకుండా అతని క్రికెట్ కెరీర్‌నే ప్రశ్నార్థకంలో నెట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఒడియన్ స్మిత్ ఆఖరి ఓవర్‌లో 18 పరుగులను డిఫెండ్ చేయలేకపోయాడు. చివరి రెండు బంతులకు రెండు సిక్స్‌లు ఇచ్చి పంజాబ్ కింగ్స్ కొంపముంచాడు. ముఖ్యంగా నాలుగో బంతికి అతను చేసిన తప్పిదం పంజాబ్ ఓటమినే శాసించింది.
చివరి ఓవర్‌లో గుజరాత్ విజయానికి 6 బంతుల్లో 19 పరుగులు అవసరం అవ్వగా.. ఓడియన్ స్మిత్ తొలి బంతిని వైడ్‌గా వేసాడు. రెండో బంతిని కూడా అలానే వైడ్‌గా వేయగా.. మిల్లర్ ముందుకు జరిగి ఉండటంతో అంపైర్ వైడ్ ఇవ్వలేదు. దాంతో నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి పరుగు కోసం వచ్చిన హార్దిక్ పాండ్యా రనౌటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన తెవాటియా సింగిల్ మాత్రమే తీసాడు. దాంతో గుజరాత్ ఓటమి ఖాయమని అంతా భావించారు. మూడో బంతిని ఫోర్ కొట్టిన మిల్లర్ నాలుగో బంతిని బౌలర్ వైపే ఆడాడు.

అయితే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో తెవాటియా పరుగు కోసం క్రీజును ధాటడంతో.. స్మిత్ రనౌట్ కోసం ప్రయత్నించాడు. బంతిని వికెట్లను తాకకపోవడంతో ఓవర్ త్రో రూపంలో సింగిల్ వచ్చింది. దాంతో గుజరాత్ విజయసమీకరణం 2 బంతుల్లో 12 పరుగులుగా మారింది. స్ట్రైక్‌లోకి వచ్చిన తెవాటియా లెగ్ సైడ్ తన ఫేవరేట్ షాట్లతో రెండు సిక్స్‌లు బాది చిరస్మరణీయ విజయాన్నందించాడు. అసలు స్మిత్ ఆ ఓవర్ త్రో ఇవ్వకుంటే గుజరాత్‌కు 2 బంతుల్లో 13 పరుగులు అవసరమయ్యేవి. అంతేకాకుండా బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బాల్స్ ఆడటంలో ఇబ్బంది పడుతున్న మిల్లర్ స్ట్రైకింగ్‌లో ఉండేవాడు. పంజాబ్ సులువుగా గెలిచేది. కానీ ఓడియన్ స్మిత్ అత్యుత్సాహంతో మ్యాచ్ పంజాబ్ చేజారింది.

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పంజాబ్ కింగ్స్ డగౌట్‌లో తెవాటియా విగ్రహాన్ని పెట్టుకోవాలని సెటైర్లు పేల్చాడు. ఒడియన్ స్మిత్‌కు ఆ ఓవర్‌త్రో జీవితాంతం వెంటాడుతుందని ట్వీట్ చేశాడు.