
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియల్ లీగ్(ఐపీఎల్) ప్రపంచంలోనే అత్యంత విలువైన లీగ్ అని అంతర్జాతీయ దినపత్రిక ఫోర్బ్స్ పేర్కొంది. ఐపీఎల్ 2009 సీజన్ నుంచి లీగ్ ఆదాయం గురించి విశ్లేషిస్తున్న ఫోర్బ్స్.. 8 జట్లతో కూడిన అప్పటి లీగ్ విలువ 67 మిలియన్ల అమెరికా డాలర్లుగా ఉందని తెలిపింది. అయితే తాజాగా ఆ విలువ ఏడాదికి 24 శాతం చొప్పున పెరిగి 1.04 బిలియన్ డాలర్లకు చేరిందని పేర్కొంది. వరల్డ్ ఫేమస్ స్పోర్ట్స్ లీగ్స్ ఎన్‌బీఏ(నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ లీగ్), ఎన్‌ఎఫ్‌ల్ (నేషనల్ ఫుట్‌బాల్ లీగ్) కంటే ఇది చాలా ఎక్కువని తెలిపింది. అమెరికాకు చెందిన ఈ రెండు లీగ్స్ వృద్దిరేటు ఏడాదికి 10, 16 శాతమే ఉండగా.. ఐపీఎల్ మాత్రం 24 శాతం వృద్దిలో ఉందని ఫోర్బ్స్ స్పష్టం చేసింది.
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. పది ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ముంబై ఇండియన్స్ అత్యంత విలువైన ఫ్రాంచైజీగా నిలిచింది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ విలువు 1.3 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 1.15 బిలియన్ డాలర్లతో చెన్నై సూపర్ కింగ్స్, 1.1 బిలియన్ డాలర్లతో కేకేఆర్ వరుసగా ముంబై తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ 1.075 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో నిలవగా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన జీఎమ్‌ఆర్ గ్రూప్ వాటా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ 1.035 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచింది.
ఇక అత్యంత అభిమాన గణం కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 1.025 బిలియన్ డాలర్ల విలువతో 6వ స్థానంలో నిలిచింది. 1 బిలియన్ డాలర్ల విలువ రాజస్థాన్, 970 మిలియన్ల డాలర్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్, 925 మిలియన్ల డాలర్లతో పంజాబ్ కింగ్స్, 850 మిలియన్ల డాలర్లతో గుజరాత్ టైటాన్స్ చివరి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఐపీఎల్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ టీమ్స్ అయిన చెన్నై, ముంబై ఈ సీజన్‌లో దారుణంగా విపలమైన విషయం తెలిసిందే.