IPL 2022, MI vs KKR: ముంబై ఇండియన్స్‌ను ముంచిన మూడు తప్పిదాలు!

పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇది ముంబైకి వరుసగా మూడో పరాజయం కావడంతో పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో నిలిచింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్ వరకు విన్నింగ్ రేసులో నిలిచిన ముంబై.. ఒకే ఒక్క ఆటగాడి తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఘోర పరాజయం చవిచూసింది. ఆ ఒక్కడు ఎవరో కాదు.. ప్యాట్ కమిన్స్. ఈ సీజన్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే జట్టు కష్టాల్లో ఉన్నపుడు అడుగుపెట్టి ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. కమిన్స్ విధ్వంసానికి తోడు మరో రెండు తప్పిదాలు ముంబై ఓటమిని శాసించాయి. అవెంటో ఓ లుక్కెద్దాం.

1. సరైన ఆరంభం లేకపోవడం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం దక్కలేదు. పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై ప్రత్యర్థి బౌలర్లు చెలరేగారు. దాంతో ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ(3) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో ముంబై బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా ఉమేశ్ యాదవ్ కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పరుగులు రావడం కష్టమైంది. దాంతో ముంబై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 35 పరుగులే చేసింది. జూనియర్ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదడంతో ఆ మాత్రం పరుగులైన చేయగలిగింది. ఆ తర్వాత కూడా పెద్దగా పరుగులు రాకపోవడంతో 10 ఓవర్లలో 2 వికెట్లకు 54 పరుగులే చేసింది. చివర్లో ధాటిగా ఆడటం ముంబై 161 పరుగులు చేయగలిగింది. అయితే రోహిత్ శర్మ తనదైన శైలిలో చెలరేగితో ముంబై భారీ స్కోర్ చేసే అవకాశం ఉండేది. అప్పుడు గెలవడానికి అవకాశాలు ఉండేవి.

2. కమిన్స్ విధ్వంసం
ఇక చేజింగ్‌లో కేకేఆర్‌కు సైతం శుభారంభం దక్కలేదు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు.. ఆ జట్టు 35/2తో నిలిచింది. మురుగన్ అశ్విన్ ధాటికి వరుస ఓవర్లలో బిల్లింగ్స్, నితీశ్ రాణా పెవిలియన్ చేరాడు. రస్సెల్ (11) కూడా ఎక్కువ సేపు నిలవకపోవడంతో ముంబై విజయం లాంఛనమేనని అనిపించింది. కానీ కమిన్స్ సునామీ ఇన్నింగ్స్ ముంబైని ముంచింది. ఒంటరి పోరాటం చేస్తున్న వెంకటేశ్‌కు జత కలిసిన అతను సిక్సర్లతో చెలరేగాడు. బుమ్రా బౌలింగ్‌లో వరుసగా 6, 4 ఫోర్ బాది ఊగిసలాడుతున్న మ్యాచ్‌ను తమ వైపు తిప్పాడు. కోల్‌కతా విజయానికి చివరి అయిదు ఓవర్లలో 35 పరుగులు కావాల్సి ఉండగా.. డానియల్ సామ్స్ వేసిన 16వ ఓవర్‌లోనే ఆ పరుగులు రాబట్టి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. వెంకటేశ్ అయ్యర్, కమిన్స్‌లలో ఏ ఒక్కరి వికెట్ తీసి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా ఫలితం మరోలా ఉండేది.


3. బలహీనమైన బౌలింగ్..
గతంతో పోల్చితే ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఈసారి బలహీనంగా ఉంది. ట్రెంట్ బౌల్ట్ వంటి పేసర్ సేవలను ఆ జట్టు కోల్పోతుంది. టైమిల్ మిల్స్, డానియల్ సామ్స్ అతని స్థానాన్ని భర్తీ చేయలేకపోతున్నారు. దాంతో బుమ్రాపై అధికభారం పడుతోంది. ముఖ్యంగా డానియల్ సామ్స్ కీలక సమయాల్లో ధారళంగా పరుగులిస్తూ జట్టుకు ఓటమికి కారణం అవుతున్నాడు. ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్.. గతంలో మాదిరి ఎఫెక్టివ్‌గా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం కూడా ఇబ్బంది పెడుతోంది. మిడిల్ ఓవర్లలో పార్టనర్‌షిప్ బిల్డ్ చేయకుండా బ్యాట్స్‌మన్‌ను అడ్డుకునే స్పిన్నర్ లేడు. ఈ వైఫల్యమే మూడు మ్యాచ్‌ల్లో ముంబై ఓటమికి ప్రధాన కారణమైంది.

సూర్య చెలరేగినా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ ( 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) అర్ధశతకంతో సత్తాచాటాడు. తిలక్ వర్మ ( 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్), పొలార్డ్ ( 5 బంతుల్లో 3 సిక్స్‌లతో 22 నాటౌట్) రాణించారు. కమిన్స్ (2/49) రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో కోల్‌కతా 5 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. కమిన్స్ ( 15 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56 నాటౌట్) వీరవిహారం చేశాడు. వెంకటేశ్ అయ్యర్ ( 41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మురుగన్ అశ్విన్ (2/25), మిల్స్ (2/38) ఆకట్టుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications