IPL 2022 Mega Auction: నలుగురికి రూ.42 కోట్లు.. ముగ్గురికి రూ.32 కోట్లు.. రిటైన్ ఆటగాళ్ల జీతాలు ఇవే!

న్యూఢిల్లీ: వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్‌లో జట్ల రూపురేఖలు మారిపోనున్నాయి. 2022 నుంచి రెండు కొత్త జట్లతో కలిపి మొత్తం 10 ఫ్రాంఛైజీలు అభిమానులను అలరించనున్నాయి. కొత్తగా వచ్చిన రెండు జట్లతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పంట పండింది. అక్షరాల రూ. 12,715 కోట్ల ఆదాయం వచ్చి చేరింది. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని భారత కార్పొరేట్ సంస్థ గోయెంకా గ్రూప్(ఆర్‌పీఎస్‌జీ) రూ.7,090 కోట్లకు, లక్నో టీమ్‌ను అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ (ఐరిలియా కంపెనీ లిమిటెడ్) రూ. 5,625 కోట్లు కుమ్మరించి దక్కించుకున్నాయి. గత సోమవారమే కొత్త జట్ల వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఇక కొత్త టీమ్స్ కోసం టెండర్ ప్రక్రియ ముగియడంతో బోర్డు ఇప్పుడు మెగా వేలం ఏర్పాట్లకు సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీని పూర్తి చేసే పనిలో పడింది. బోర్డు రూపొందించిన ఈ పాలసీకి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. ఒక్కక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి.

జట్టుకు నలుగురు..
పాత జట్లలోని ప్రతీ జట్టు గరిష్టంగా నలుగురిని రిటైన్ చేసుకోవచ్చని, ఇందులో ఇద్దరు భారత ఆటగాళ్లు, మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు, లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్ ఉండాలని ఇటీవల ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్‌ఫో పేర్కొంది. పాత జట్ల రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిన ఆటగాళ్లు, వేలానికి అందుబాటులో ఉండే జాబితా నుంచి కొత్తగా వచ్చిన జట్లు ముగ్గురి ప్లేయర్లను తీసుకోవాలని, ఆ తర్వాతే మెగా వేలం జరుగుతుందని చెప్పింది. ఇప్పటికే ఈ విషయాన్ని ఫ్రాంచైజీలకు వెల్లడించిందని, నవంబర్ 30లోపు తమ రిటైన్షన్ జాబితాలను సమర్పించాలని గడువు పెట్టిందని కూడా పేర్కొంది. అంతేగాకుండా ఈ సారి వేలంలో ప్రతీ జట్టు పర్స్ మనీని రూ.85 కోట్ల నుంచి రూ.90 కోట్లకు పెంచనున్నట్లు తెలిపింది. అయితే జట్టు అట్టిపెట్టుకునే ఆటగాళ్లకు తమ దగ్గర ఉన్న రూ.90 కోట్లలో గరిష్టంగా ఎంత శాతం చెల్లించాలనే దానిపై మాత్రం స్పష్టత లేదని పేర్కొంది.

నలుగురికి రూ. 42 కోట్లే..
అయితే ఈ విషయంలో క్రిక్ బజ్ క్లారిటీ ఇచ్చింది. ఫ్రాంచైజీలకు బీసీసీఐ చేసిన మెయిల్ ఆధారంగా తమ కథనంలో రిటైన్ ఆటగాళ్ల జీతాల వివరాలను వెల్లడించింది. ఒక్కో జట్టు తమ రిటైన్ ఆటగాళ్ల కోసం గరిష్టంగా రూ.42 కోట్లు, కనిష్టంగా రూ.14 కోట్లు ఖర్చుపెట్టుకోవచ్చని పేర్కొంది. ఈ కథనం ప్రకారం నలుగురి ప్లేయర్లను రిటైన్ చేసుకుంటే ఫ్రాంచైజీలు తమ పర్స్ వాల్యూ నుంచి రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా నలుగురిలో మొదటి ప్లేయర్‌కు రూ. 16 కోట్లు, రెండో ఆటగాడికి రూ. 12 కోట్లు, మూడో ఆటగాడికి రూ.8 కోట్లు, నాలుగో ఆటగాడికి రూ.6 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ముగ్గురి ప్లేయర్లను రిటైన్ చేసుకుంటే రూ.33 కోట్లను ఫ్రాంచైజీలు తమ పర్స్ వాల్యూ నుంచి చెల్లించాల్సి ఉంటుంది. దాంతో ఆటగాళ్ల వేతనాలు రూ.15 కోట్లు, రూ 11 కోట్లు, రూ. 7 కోట్లుగా ఉంటాయి.

డిసెంబర్ చివరి వారంలో..
ఇద్దరిని రిటైన్ చేసుకుంటే పర్స్ వాల్యూ నుంచి రూ. 24 కోట్లు ఇవ్వాలి. ఇందులో ఒకరికి రూ.14 కోట్లు, మరొకరికి రూ. 10 కోట్లు వేతనంగా చెల్లించాలి. ఇక ఒకరిని మాత్రమే తీసుకుంటే రూ.14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నవంబర్ 1 నుంచి నంబంబర్ 30లోపు 8 పాత జట్లు తమ రిటైన్ ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి వెల్లడించాలి. ఆ తర్వాత మిగిలిపోయిన ఆటగాళ్ల జాబితా నుంచి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 25 మధ్య కొత్త జట్లు ముగ్గురిని ఎంచుకోవాలి. ఈ విషయాలను బీసీసీఐ ఫ్రాంచైజీలకు రాసిన మెయిల్‌లో పేర్కొంది. ఆ తర్వాత మెగా వేలం జరిగే అవకాశాలున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications