IPL 2022 Mega Auction: అందుకే ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోలేదు?

హైదరాబాద్: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు కీలక ఘట్టమైన రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. కొన్ని అనూహ్యాలు... మరికొన్ని ఆశ్చర్యకర నిర్ణయాలు మినహా అంచనాలకు అనుగుణంగానే ఈ రిటెన్షన్ ప్రక్రియ సాగింది. సుదీర్ఘ కాలంగా తమ విజయాల్లో భాగంగా ఉన్న కొందరు ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు నమ్మకం పెట్టుకోగా, మరికొందరిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొనసాగించేందుకు సిద్ధపడ్డాయి. టీమ్‌కు నలుగురి చొప్పున 32 మందికి అవకాశం ఉన్నప్పటికీ ఎనిమిది టీమ్స్ కలిపి 27 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. ఇక ఈ మెగా వేలం కారణంగా చాలా ఇబ్బంది పడిన జట్టు ఏదైనా ఉందా? అంటే అది ముంబై ఇండియన్సే. గరిష్టంగా నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో ఆ జట్టు తమ స్టార్ ఆటగాళ్లందరిని వదులుకోవాల్సింది.

స్టార్ ఆటగాళ్లంతా...
రిటెన్షన్ జాబితా ప్రకటించే సమయంలో ముంబై ఫ్రాంచైజీ ఈ విషయంపై విచారం వ్యక్తం చేసింది. తప్పని పరిస్థితుల్లో తమ చాంపియన్ ఆటగాళ్లను కోల్పోవాల్సి వస్తుందని, వారిని తిరిగి తీసుకునేందుకు వేలంలో సాయశక్తులా ప్రయత్నిస్తామని పేర్కొంది. ఇక ముంబై ఇండియన్స్ ఊహించినట్లుగానే కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌తో పాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకుంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌లను వదులు కోవాల్సివచ్చింది. వాస్తవానికి సూర్యకు బదులు ఇషాన్ కిషన్‌నే ముంబై రిటైన్ చేసుకుంటుందని ప్రచారం జరిగింది.

ఆ ఒక్క కారణంతోనే..
ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌తో పాటు వికెట్ కీపింగ్ సామర్థ్యం కలిగి ఉండటం.. అంతకుమించి లెఫ్టాండర్ కావడంతో ఇషాన్ ముంబై జట్టులో ఉండటం ఖయామని అంతా భావించారు. కానీ ముంబై ఇండియన్స్ మాత్రం ఇషాన్ కిషన్‌ను కాదని సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకుంది. అయితే మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అనే ఒకే ఒక కారణంతోనే సూర్యను ముంబై ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ డౌన్‌లో వచ్చి పరిస్థితిలకు తగ్గట్లు ఆడగలడని, నాలుగో స్థానంలో వచ్చి కూడా మెరుపులు మెరిపించగలడని, ఫినిషర్ పాత్రలో కూడా పనికి వస్తాడని భావించే ఇషాన్‌ను కాదని సూర్యను తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మిడిలార్డర్‌లో బాగా ఆడగలిగే భారత బ్యాట్స్‌మన్‌లు లేకపోవడం కూడా సూర్యకు కలిసి వచ్చింది. పైగా మైదానం నలువైపుల షాట్లు ఆడగలిగే సామర్థ్యం సూర్య సొంతం.

ఇషాన్, పాండ్యా చేజారినట్లే..
అంతేకాకుండా సూర్య కోసం కొత్త ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తుండటం తెలిసి కూడా ఈ నిర్ణయం తీసుకోవచ్చనే వాదన కూడా వినిపిస్తుంది. ఇషాన్‌ను వేలంలో తీసుకోవచ్చని భావించి.. సూర్య చేజారుకుండా జాగ్రత్తపడిందని కొందరు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వికెట్ కీపింగ్ సామర్థ్యంతో పాటు యువ ప్లేయర్ అయిన ఇషాన్ కిషన్‌ను కొత్త ఫ్రాంచైజీలు అస్సలు వదలవని, అతన్ని అహ్మదాబాద్ కచ్చితంగా తీసుకుందనే వాదన వినిపిస్తోంది. ఇషానే కాదు హార్దిక్ పాండ్యా కూడా ముంబై చేజారినట్లేననే అభిప్రాయం వినిపిస్తోంది. బౌలింగ్ చేయకపోయినా.. మిడిలార్డర్‌లో హార్దిక్ అద్భుతంగా రాణించగలడు. అంతేకాకుండా తనదైన రోజున ఎంతటి బౌలర్‌నైనా చితక్కొట్టగలడు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ వేలంలోకి రాకుండానే ముంబై చేజారుతాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆ ఫార్మూలాతోనే..
ఇక రిటెన్షన్ ప్రక్రియను కూడా ముంబై ప్రణాళిక ప్రకారమే ముగించినట్లు అర్థమవుతోంది. రోహిత్ శర్మ ఓపెనర్.. సూర్య మిడిలార్డర్, పొలార్డ్ ఆల్‌రౌండర్, జస్‌ప్రీత్ బుమ్రా బౌలర్.. జట్టులోని నలుగు విభాగాలను కవర్ చేసి... మిగతా స్థానాలను భర్తీ చేయాలనే ఉద్దేశంతోనే వీరిని రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇషాన్ రిటైన్ చేసుకుంటే అతను కూడా ఓపెనర్ అవుతాడని,లేదంటే ఫస్ట్ డౌన్‌లో ఆడుతాడని, మిడిలార్డర్ ఖాళీగా ఉంటుందనే సూర్యను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ముంబై ఇప్పుడు వికెట్ కీపర్‌తో పాటు లెఫ్టాండర్స్‌పైనే దృష్టిసారించాలి. ఎందుకంటే రిటైన్ చేసుకున్న నలుగురి ఆటగాళ్లలో ముగ్గురు రైట్ హ్యాండర్సే. ఇలాంటి పక్కా లెక్కలతోనే ముంబై వేలంలోకి బరిలోకి దిగాల్సి ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications