IPL 2022 Mega Auction: సీఎస్‌కేలోకి రవిచంద్రన్ అశ్విన్.. హింట్ ఇచ్చిన తమిళనాడు స్పిన్నర్!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే అతనితో చెన్నై ఫ్రాంచైజీ లోపకాయిరి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అతను చేసిన ఈ వ్యాఖ్యలే ఈ ప్రచారానికి బలం చేకూర్చుతుంది. లీగ్‌లోకి కొత్తగా రెండు జట్లు వచ్చి చేరడంతో ఐపీఎల్ 2022లో పది టీమ్స్ పోటీపడనున్నాయి. దాంతో మెగా వేలం నిర్వహణ అనివార్యమైంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగించిన బీసీసీఐ.. కొత్త జట్లకు పికప్ ఆప్షన్ ఇచ్చింది. రిటెన్షన్ అనంతరం వేలానికి అందుబాటులో ఉన్న ఆటగాళ్ల నుంచి నేరుగా ముగ్గురిని ఎంచుకునే అవకాశాన్ని ఇచ్చింది.

చెన్నైతోనే కెరీర్ షురూ..
అయితే కొత్త ఫ్రాంచైజీలు అశ్విన్‌ను సంప్రదించినా అతను అంగీకరించలేదట. సీఎస్‌కే తరఫున ఆడాలనే ఉద్దేశంతోనే అశ్విన్ కొత్త జట్ల ఆఫర్లను తిరస్కరించాడట. అరంగేట్ర సీజన్ 2008లో అనామక ఆటగాడిగా చెన్నై జట్టులోకి వచ్చిన అశ్విన్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్పిన్నర్‌గా ఎదిగాడు. 2015 వరకు ఆ జట్టులోనే కొనసాగాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ సస్పెన్స్‌కు గురవ్వడంతో 2016-17 సీజన్లలో రైజింగ్ పుణేకు ఆడాడు. ఆ తర్వాత 2018లో చెన్నై రీఎంట్రీ ఇచ్చినా అశ్విన్‌ను తీసుకోలేదు. 2018-19 వరకు పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. 2020 సీజన్‌కు ముందు ట్రేడింగ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్‌కు వచ్చాడు. ఈ ఏడాది కూడా ఆ జట్టుకే ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ వెటరన్ స్పిన్నర్‌ను రిటైన్ చేసుకోలేదు.

ఓనమాలు నేర్చుకున్నా..
తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఇటీవల అశ్విన్ చేసిన వ్యాఖ్యలు అతను మళ్లీ చెన్నై జట్టులోకి వస్తాడనే వార్తలకు తెరలేపాయి. 'చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంఛైజీతో నాకు మంచి అనుబంధం ఉంది. చెన్నై జట్టు నాకు స్కూల్ లాంటిది. క్రికెటర్‌గా ఓనమాలు నేర్చుకుంది ఇక్కడే. ప్రీ కేజీ, ఎల్‌కేజీ, యూకేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. తర్వాత ఉన్నత చదువుల కోసం బయటకి వెళ్లాను. చదువులు పూర్తయ్యాక ఎవరైనా.. ఇంటికి రావాల్సిందే. నేను కూడా నా సొంత ఇంటికి (చెన్నై)కి రావాలనుకుంటున్నాను.

వేలంపైనే ఆధారపడి ఉంది..
ఇదంతా త్వరలో జరగనున్న ఐపీఎల్ వేలంపై ఆధారపడి ఉంది. అక్కడ జరిగే పరిణామాలను నేను అర్థం చేసుకోగలను. ఐపీఎల్‌లో పాల్గొనే 10 జట్లు పది రకాల వ్యూహాలతో వస్తాయి. నన్ను ఏ జట్టు దక్కించుకుంటుందో చెప్పలేను. కానీ, ఓ ప్రొఫెషనల్ ఆటగాడిగా అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నిస్తాను. మనపై నమ్మకంతో ఫ్రాంఛైజీ ఎంతో డబ్బు ఖర్చు చేస్తుంది. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తాను' అని అశ్విన్ పేర్నొన్నాడు.

షారూఖ్ ఖాన్ సైతం..
దేశవాళీ సెన్సేషన్, తమిళనాడు హిట్టర్ షారూఖ్ సైతం చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ఫ్రాంచైజీ పెద్దలు షారూఖ్‌ను కలిసినట్లు సమాచారం. అందుకే పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకుంటామని చెప్పినా.. ఈ అనామక ప్లేయర్ అంగీకరించలేదు. కొత్త జట్లకు చిక్కలేదు. దేశవాళీ టీ20 లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో లాస్ట్ బాల్‌కు సిక్స్ కొట్టి తమిళనాడును చాంపియన్‌గా నిలిపిన షారూఖ్ తీసుకునేందుకు ఫ్రాంచైజీలన్నీ సిద్దంగా ఉన్నాయి. మరోవైపు అశ్విన్‌ను తీసుకునేందుకు కూడా చెన్నై సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే భారీ ధర పలికితే మాత్రం అతన్ని వదులుకోవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications