
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా మెగా వేలం జరగనుంది.
ఇప్పటికే పాత జట్ల రిటెన్షన్, కొత్త టీమ్‌లు ఆటగాళ్ల ఎంపికతోపాటు వేలం కోసం రిజిష్ట్రేషన్ కూడా పూర్తి అయిపోయింది. మెగా వేలానికి మొత్తం 1214 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకోగా.. అందులో నుంచి బీసీసీఐ 590 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేసింది.
ఇందులో 228 మంది క్యాప్‌డ్ (జాతీయ జట్లకు ఎంపికైన వారు), 355 మంది అన్‌క్యాప్‌డ్ (జాతీయ టీమ్‌కు ఎంపిక కానివారు), ఏడుగురు అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఈ షార్ట్ లిస్ట్‌లో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు చోటు దక్కింది. రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌తో అర్జున్ టెండూల్కర్ వేలంలో ఉన్నాడు. గతేడాది అతన్ని రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే తుది జట్టులో అతనికి అవకాశం దక్కలేదు. పైగా గాయం కారణంగా అతను లీగ్ మధ్యలోనే వెనుదిరిగాడు.
ఈ సారి ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనబోయే వారిలో అత్యధిక వయసు కలిగిన ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ (43) కాగా..తక్కువ వయసు కలిగిన ఆటగాడు అఫ్గానిస్థాన్ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ నూర్ అహ్మద్ (17) నిలిచాడు. పశ్చిమ్ బెంగాల్ మంత్రి, క్రికెటర్ మనోజ్ తివారీ (రూ. 50 లక్షలు), వెటరన్ బౌలర్ శ్రీశాంత్ (రూ. 50 లక్షలు) మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ప్రస్తుతం అండర్ 19 ప్రపంచకప్ ఆడుతున్న భారత కుర్రాళ్లు కూడా మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. యువ భారత జట్టు కెప్టెన్ యశ్ ధుల్‌తో పాటు మరో ఏడుగురు భారత ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు. ఓపెనర్ హర్నూర్ సింగ్, ఆల్‌రౌండర్లు కుశాల్ తాంబే, అనీశ్వర్ గౌతమ్, రాజ్ అంగద్ భవ, రాజ్‌వర్థన్ హంగార్గేకర్, బౌలర్లు విక్కీ ఓస్వల్, వాసు వత్స్ మెగా వేలానికి షార్ట్ లిస్ట్ అయ్యారు. వీరిలో రాజవర్థన్ హంగార్గేకర్ బేస్ ప్రైజ్ రూ. 30 లక్షలు కాగా, మిగిలిన అందరూ రూ.20 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో పోటీపడనున్నారు.