
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ జోరు కొనసాగుతుంది. ఈ సీజన్‌లో ఈ ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ రెండో సెంచరీ సాధించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన బట్లర్.. 59 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. పాట్ కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ తొలి బంతిని లాంగాన్ దిశగా భారీ సిక్సర్ బాదిన బట్లర్ లీగ్‌లో మూడో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ సీజన్‌లో తొలి సెంచరీని ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అందుకున్న బట్లర్... తాజా సెంచరీతో పలు రికార్డులను తనపేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2022లో రెండో సెంచరీ అందుకున్న బట్లర్‌కు లీగ్‌లో ఇది మూడో శతకం. ఇక గత 23 టీ20 ఇన్నింగ్స్‌ల్లో బట్లర్‌కు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. ఇక గత ఏడు ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో బట్లర్ మూడుసార్లు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఐపీఎల్‌లో భాగంగా బ్రబౌర్న్ స్టేడియంలో సెంచరీ బాదిన నాలుగో ఆటగాడిగా బట్లర్ రికార్డు అందుకున్నాడు. ఇంతకముందు యూసఫ్ పఠాన్, షేన్ వాట్సన్, కేఎల్ రాహుల్ ఈ ఘనత అందుకున్నారు. ఒకే సీజన్‌లో రెండు సెంచరీలు బాదిన బ్యాట్స్‌మన్ జాబితాలోనూ బట్లర్ చోటు దక్కించుకున్నాడు.
ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 2016 సీజన్‌లో 4 సెంచరీలతో టాప్‌లో ఉండగా శిఖర్ ధావన్(2020), షేన్ వాట్సన్(2018), హాషిమ్ ఆమ్లా(2017), క్రిస్ గేల్(2011) ఒక సీజన్‌లో రెండు సెంచరీలు బాదారు.
జోస్ బట్లర్(61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 103) శతకంతో రాజస్థాన్ రాయల్స్.. కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ముందు 218 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే భారీ టార్గెట్. జోస్ బట్లర్ శతకానికి అండగా సంజూ శాంసన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) షిమ్రన్ హెట్‌మైర్(13 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లతో 26 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు తీయగా..శివం మావి, ప్యాట్ కమిన్స్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసారు.