
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) బ్యాట్స్‌మన్ నితీష్ రాణాపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 అతిక్రమించడంతో అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు మందలించారు. నితీష్ రాణా తన తప్పిదాన్ని అంగీకరించడంతో జరిమానాతో సరిపెట్టారు. లేకుంటే అతనిపై ఓ మ్యాచ్ నిషేధం పడేది.
ఇక ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్ రిఫరీ మందలించాడు. బుమ్రా కూడా తన నేరాన్ని అంగీకరించాడు. అయితే వీళ్లు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఎక్కడ ఉల్లంఘించారనే విషయంపై ఐపీఎల్ నిర్వాహకులు స్పష్టతనివ్వలేదు. మ్యాచ్ ముగిసిన అనంతరం వీరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయో బబుల్ నిబంధనలను బ్రేక్ చేశారా? అనే సందేహం కలుగుతంది. ఇప్పటివరకు ఆయా జట్లు గానీ నిర్వహాకులు గానీ ఈ ఇద్దరు ఆటగాళ్లు చేసిన తప్పిదం ఏంటో అధికారికంగా వెల్లడించలేదు.
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ ( 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) అర్ధశతకంతో సత్తాచాటాడు. తిలక్ వర్మ ( 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్), పొలార్డ్ ( 5 బంతుల్లో 3 సిక్స్‌లతో 22 నాటౌట్) రాణించారు. కమిన్స్ (2/49) రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో కోల్‌కతా 5 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. కమిన్స్ ( 15 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56 నాటౌట్) వీరవిహారం చేశాడు. వెంకటేశ్ అయ్యర్ ( 41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మురుగన్ అశ్విన్ (2/25), మిల్స్ (2/38) ఆకట్టుకున్నారు. ఇది ముంబైకి వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.