

అహ్మదాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్‌ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొంది తొలిసారి టైటిల్ సొంతం చేసుకుంది. అరంగేట్ర సీజన్‌లోనే హార్దిక్ పాండ్యా సారథ్యంలో దుమ్మురేపింది.
ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. జోస్ బట్లర్(35 బంతుల్లో 5 ఫోర్లతో 39) మినహా అంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో హార్దిక్ మూడు వికెట్లు తీయగా.. సాయి కిషోర్ 2 వికెట్లు పడగొట్టాడు. షమీ, యశ్ దయాల్, రషీద్ తలో వికెట్ తీసారు.
అనంతరం గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(43 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 45 నాటౌట్), డేవిడ్ మిల్లర్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్), హార్దిక్ పాండ్యా(30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిధ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
131 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభం దక్కలేదు. ప్రసిధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్‌లోనే ఓపెనర్ వృద్దిమాన్ సాహా(5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ను చాహల్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అతను క్రీజులో పాతుకుపోయాడు. మాథ్యూవేడ్‌ను బౌల్ట్ క్యాచ్ ఔట్ చేయడంతో పవర్ ప్లేలో గుజరాత్... పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా, గిల్ ఆచితూచి ఆడుతూ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో పాటు వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని చాహల్ విడదీసాడు. హార్దిక్ పాండ్యాను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 63 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చి డేవిడ్ మిల్లర్ ధాటిగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు.మరోవైపు శుభ్‌మన్ గిల్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి జట్టును టైటిల్ విజేతగా నిలబెట్టాడు.