
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తూనే అందరి దృష్టిని ఆకర్షించిన లక్నో ఫ్రాంచైజీ.. వచ్చే సీజన్ కోసం అన్ని విధాలుగా సిద్దమవుతోంది. ఇప్పటికే టీమ్ హెడ్ కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండ్రీ ఫ్లవర్‌ను నియమించిన ఆ జట్టు.. మెంటార్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను నియమించుకుంది. ఈ విషయాన్ని ఆ జట్టు వర్గాలు ధృవీకరించాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా.. రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన సారథిగా ఎంతో అనుభవమున్న గంభీర్.. లక్నో ఫ్రాంచైజీకి సరిగ్గా సరిపోతాడని టీమ్‌కు చెందిన అధికారి తెలిపాడు. యువ ఆటగాళ్ల సత్తాను గుర్తించేందుకు.. కోచ్‌కు సహాయంగా గంభీర్ ఉంటాడని పేర్కొన్నారు.
ఇక లక్నో మెంటార్‌గా నియమించడంపై గౌతమ్ గంభీర్ సైతం హర్షం వ్యక్తం చేశాడు. ఫ్రాంచైజీ యజమాని ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ అధినేత గోయెంకాకు ధన్యవాదాలు తెలిపాడు. తనలో ఇంకా సత్తా ఉందని తెలిపాడు. జట్టుకు అన్ని విధాలుగా, తన సాయశక్తులా కృషిచేస్తానని తెలిపాడు. ఇక రూ.7090 కోట్ల భారీ ధరకు ఫ్రాంచైజీని దక్కించుకున్న గోయెంకా గ్రూప్.. ఐపీఎల్ 2022 సీజన్ కోసం అన్ని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇప్పటికే టీమ్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించుకున్నట్లు తెలుస్తోంది. అతనికి రూ.20 కోట్ల భారీ ఆఫర్ చూపించిందని, అతనితో పాటు రషీద్ ఖాన్ వంటి స్టార్ ఆటగాళ్లకు గాలం వేసిందని ప్రచారం జరుగుతోంది.
ఆండ్రీ ఫ్లవర్‌ను కోచ్ నియమించడాన్ని సంజీవ్ గోయెంకా ధవీకరించారు. 'ఆండీ ఆటగాడిగా, కోచ్‌గా క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. మేము అతని వృత్తి పట్ల పట్టుదలని గౌరవిస్తాము. మా జట్టును విజయ పథంలో నడిపిస్తాడాని నేను భావిస్తున్నాను అని అతను పేర్కొన్నాడు.
ఇక ఫ్లవర్ మాట్లాడుతూ.. "లక్నో ఫ్రాంచైజీలో చేరినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, ఈ అవకాశం నాకు ఇచ్చినందకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 1993లో నేను తొలిసారిగా భారత పర్యటనకు వచ్చాను. అప్పటినుంచి నేను ఎల్లప్పుడూ భారత్‌లో పర్యటించడం, ఆడడం, ఇక్కడ కోచింగ్‌ని ఇష్టపడతాను. భారత్‌లో క్రికెట్ పట్ల ఉన్న మక్కువ అసమానమైనది. నేను గోయెంకా, జట్టుతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను" అని అతడు పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఆండీ ఫ్లవర్ గత రెండు సీజన్లో పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు