
కోల్‌కతా: ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్, పవర్ ప్లే స్పెషలిస్ట్ దీపక్ చాహర్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన మూడో టీ20లో అద్భుత బౌలింగ్‌తో పవర్‌ప్లేలోనే రెండు కీలక వికెట్లు తీసిన దీపక్ చాహర్.. ఆ తర్వాత తొడకండరాలు పట్టేయడంతో మైదానం వీడాడు.
ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే విండీస్ ఓపెనర్ కైల్ మేయర్స్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చిన చాహర్.. తన మరుసటి ఓవర్‌లో షై హోప్‌ను కూడా అదే తరహాలో ఔట్ చేశాడు. అయితే ఆ ఓవర్ ఐదో బంతి వేసే క్రమంలో తొడ కండరాల గాయానికి గురయ్యాడు. వెంటనే ఫిజియో వచ్చి పరిశీలించి.. బయటకు తీసుకెళ్లాడు. దాంతో ఆ ఓవర్ చివరి బంతిని వెంకటేశ్ అయ్యర్ వేసాడు.
అయితే దీపక్ చాహర్ గాయం పెద్దది అయితే అతను ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభం మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నాడు. అదే జరిగితే చెన్నై సూపర్ కింగ్స్‌కు తీరని నష్టం జరగనుంది. బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలంలో చెన్నై.. రూ. 14 కోట్ల భారీ ధరకు అతన్ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సాధారణంగా తొడ కండరాల్లో గ్రేడ్ 1 టియర్ ఉంటే 6 వారాల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గాయం నేపథ్యంలో అతను శ్రీలంకతో ఫిబ్రవరి 24న జరగనున్న అప్‌కమింగ్ టీ20 సిరీస్‌కు కూడా దూరం కానున్నాడు. అతను నేరుగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లి.. అక్కడ రిహాబిలిటేషన్ తీసుకునే అవకాశం ఉంది.
మూడో టీ20లో సమష్టిగా చెలరేగిన టీమిండియా 17 పరుగులతో గెలుపొందింది. ఫలితంగా టీ20 సిరీస్‌ను కూడా 3-0తో వైట్ వాష్ చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో ఫోర్, 7 సిక్స్‌లతో 65) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్) అండగా నిలిచాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 91 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, షెఫెర్డ్, చేజ్, వాల్ష్, డ్రేక్స్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆ జట్టులో నికోలస్ పూరన్(47 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 61) వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాదినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ రెండేసి వికెట్లు తీసారు.