
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఢిల్లీ జట్టులో ఆరుగురికి కరోనా వైరస్ సోకడంతో ఈ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ కరోనా కలకలంతో అప్రమత్తమైన బీసీసీఐ ముందస్తు చర్యలు తీసుకొని మ్యాచ్ నిర్వహిస్తోంది. షెడ్యూల్ ప్రకారం పుణే వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌ను ముంబైకి తరలించిన బీసీసీఐ.. ఆటగాళ్లందరికీ పలు మార్లు పరీక్షలు నిర్వహించి నెగటీవ్ వచ్చిన ఆటగాళ్లతో మ్యాచ్ జరుపుతోంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. జట్టులో కరోనా కేసులపై స్పందిస్తూ తమ జట్టు దురదృష్టమని చెప్పాడు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని అస్సలు అనుకోలేదన్నాడు. గత మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో తమ బలాలను గుర్తించామని చెప్పాడు. కరోనా బారిన పడిన మిచెల్ మార్ష్ ప్లేస్‌లో సర్ఫరాజ్ బరిలోకి దిగుతున్నాడని చెప్పాడు.
గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన మయాంక్ అగర్వాల్ పంజాబ్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్నానని చెప్పాడు. తనతో పాటు ఎల్లిస్ జట్టులోకి రాగా.. ఓడియన్ స్మిత్ ఉద్వాసనకు గురయ్యాడని తెలిపాడు. ఇది వ్యూహాత్మక మార్పేనని చెప్పాడు. ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేస్తామని, ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, షారూఖ్ ఖాన్, కగిసో రబడా, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్షదీప్ సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్, రోవ్‌మన్ పొవెల్, లలిత్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్