
సూరత్: ఐపీఎల్ 2022 సీజన్ టైటిలే లక్ష్యంగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) తమ సన్నాహకాలను మొదలు పెట్టింది. ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ఇంకా 20 రోజుల సమయం ఉన్నా.. అందరి కన్నా ముందే ప్రాక్టీస్ క్యాంప్ షురూ చేసింది. లీగ్ మొత్తం ముంబై, పుణేల్లో జరగనున్న నేపథ్యంలో అదే తరహా మైదానం కలిగిన సూరత్‌లో చెన్నై శిక్షణా శిభిరం ఏర్పాటు చేసింది. మూడు రోజుల క్వారంటైన్ అనంతరం ఆటగాళ్లంతా ఇవాళే(ఆదివారం) మైదానంలోకి అడుగుపెట్టారు.
అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ఈ 20 రోజులు తీవ్ర కసరత్తులు చేయనున్నారు. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లతో పాటు యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షించనున్నారు. మొత్తానికి టీమ్ కాంబినేషన్.. లీగ్‌లో అనుసరించాల్సిన వ్యూహాలను ఈ ప్రాక్టీస్ క్యాంప్ ఆధారంగానే సిద్దం చేయనున్నారు. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు యువ ఆటగాళ్లు కేఎమ్ ఆసీఫ్ ఇతర ప్లేయర్లు ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొన్నారు. తొలి రోజు ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటోలను సీఎస్‌కే ట్విటర్ వేదికగా పంచుకుంది.
మాస్క్‌తో ఉన్న ధోనీతో పాటు నెట్ సెషన్‌లో పాల్గొన్న ఆసీఫ్.. ఇతర ఆటగాళ్ల కసరత్తులకు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ఇక ధోనీకి కెరీర్‌లో ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావడంతో అతని ఆట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు సూరత్‌లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. చెన్నై టీమ్ సూరత్‌కు వస్తున్న విషయాన్ని ముందే తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో టీమ్ బస చేసే హోటల్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్ వేదికగా పంచుకుంది. సింగమ్స్ ఇన్ సూపర్ అనే హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేసింది. ఇక ఈ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్‌తోనే ప్రారంభమవ్వనుంది.
26వ వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా.. మార్చి 31న లక్నో, ఏప్రిల్ 3న పంజాబ్ కింగ్స్, ఏప్రిల్ 9న సన్‌రైజర్స్ హైదరాబాద్, 12న ఆర్‌సీబీ, 17న గుజరాత్, 21న ముంబై, 25న పంజాబ్, మే1న సన్‌రైజర్స్, 4న ఆర్‌సీబీ, 8న ఢిల్లీ, 15న గుజరాత్ ఆడనుంది. ఇక చెన్నై చివరి మ్యాచ్ మే 20న రాజస్థాన్ రాయల్స్‌తో జరగనుంది.