
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడి చతికిలపడ్డ ముంబై ఇండియన్స్‌పై కందిరీగలు కూడా కన్నెర్ర చేశాయి. చెన్నై సూపర్ కింగ్స్‌తో డీవై పాటిల్ మైదానం వేదికగా గురువారం జరగనున్న మ్యాచ్ కోసం ముమ్మరంగా సాధన చేస్తున్న ముంబై ఆటగాళ్లపై కందరీగలు దాడి చేశాయి. దాంతో ముంబై ఇండియన్స్ మంగళవాం తమ ప్రాక్టీస్ సెషన్‌ను అర్థంతరంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తన ట్విటర్ వేదికగా తెలియజేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా అభిమానులతో పంచుకుంది.
18 సెకన్ల నిడివి గలిగిన ఈ వీడియోలో కందిరీగల నుంచి తప్పించుకునేందుకు ముంబై ఆటగాళ్లంతా నేలపై పడుకొని కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై అభిమానులు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఈ కందిరీగల గుంపును కెమెరాలో బందించిన వీరుడెవరంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం చెన్నైతో మ్యాచ్ కూడా డౌటేనని కామెంట్ చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ కందిరీగల వల్ల గాయలవ్వలేదంటున్నారు. అవి కుడితే సీజన్ మొత్తానికి దూరమయ్యేవారని అభిప్రాయపడుతున్నారు.
లీగ్ చరిత్రలోనే ఐదు టైటిళ్లు గెలిచి అత్యుత్తమ జట్టుగా ప్రశంసలు అందుకున్న ముంబై ఇండియన్స్ ఈసారి ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో వరుసగా ఓటమి పాలైంది. బౌలింగ్ వైఫల్యంతో పాటు రోహిత్ శర్మ నిలకడలేమి జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది.
ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలని ముంబై ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు చెన్నై సైతం 6 మ్యాచ్‌ల్లో 5 పరాజయాలతో చతికిలపడింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వైఫల్యంతో పాటు దీపక్ చాహర్ గైర్హాజరీ జట్టు విజయవకాశాలను దెబ్బ తీస్తోంది. ముంబై ఇండియన్స్‌లో సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ రాణిస్తున్నా.. బౌలర్ల నుంచి సహకారం లభించడం లేదు. సూర్య ఇప్పటికే 200 ప్లస్ రన్స్ చేయగా.. తిలక్ వర్మ 6 ఇన్నింగ్స్‌ల్లో 184 రన్స్ చేశాడు.