IPL 2022: కొత్త జట్ల రేసులో అహ్మదాబాద్, లక్నో పుణే.. బీసీసీఐ టార్గెట్ 5 వేల కోట్లు!

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన ధనాధన్ క్రికెట్ లీగ్. ఈ క్యాష్ రిచ్ లీగ్ రాకతో భారత క్రికెట్ స్వరూపమే మారిపోయింది. యావత్ క్రికెట్ ప్రపంచం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గుప్పిట్లోకి వచ్చింది. ప్రతీ క్రికెటర్ ఒక్కసారైనా ఐపీఎల్ ఆడాలనుకునేంత ఆదరణ వచ్చింది. ప్రతీ ఏడాది ఐపీఎల్ విలువ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 8 జట్లతో జరుగుతున్న లీగ్‌ను 10 జట్లకు పెంచాలని ఎప్పట్నుంచో బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా సన్నాహకాలు కూడా మొదలుపెట్టింది.
8 జట్లతో ఈ సీజనే చివరిదని వచ్చే సీజన్లో 10 జట్లు పాల్గొంటాయని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఇప్పటికే ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైందని పేర్కొన్నాడు. అయితే ఈ కొత్త ఫ్రాంచైజీల బేస్ ప్రైజ్‌ను రూ. 2వేల కోట్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ వార్త భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. ఈ విషయాన్ని బోర్డుకు సంబంధించిన ఓ అధికారే తెలిపారు.

రూ.5 వేల కోట్లు..
'ఏ కంపెనీ అయినా రూ. 10 లక్షలు చెల్లించి బిడ్ దాఖలు చేయవచ్చు. అయితే ఆ కంపెనీ వార్షిక టర్నోవర్ రూ. 3 వేల కోట్ల వరకు ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలి. ఇంతకుముందు ఫ్రాంచైజీ కనీస ధర (బేస్ ప్రైస్) రూ.1700 కోట్లుగా అనుకున్నాం. కానీ దానిని రూ.2 వేల కోట్లకు మార్చాలని ఇటీవలే నిర్ణయించాం. ఇప్పటికే కొత్త ఫ్రాంచైజీల కోసం చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ రెండు జట్లకు కలిపి కనీసం రూ.5 వేల కోట్లు సమకూరుతాయని భావిస్తున్నాం. 14వ సీజన్లో మొత్తంగా 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.'అని సదరు అధికారి చెప్పుకొచ్చాడు.

లక్నో, పుణె..
కొత్త ఫ్రాంచైజీల రేసులో అహ్మదాబాద్, లక్నో, పుణె ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, లక్నోలోని ఏకనా స్టేడియాలు భారీ సామర్థ్యంతో కూడుకున్నవి. దీంతో ఈ రెండు పట్టణాల పేర్లు కొత్త ఫ్రాంచైజీలకు అనువుగా ఉన్నాయి. ఇక కంపెనీల విషయానికొస్తే అదానీ, ఆర్పీజీ సంజీవ్ గోయంక గ్రూప్, టొరెంట్ ఫార్మాతో పాటు మరికొన్ని సంస్థలు బిడ్ దాఖలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. కొంత మంది బాలీవుడ్, సౌతిండియన్ హీరోలు సైతం ఫ్రాంచైజీలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్‌లో మెగా వేలం..
రెండు కొత్త జట్ల చేరికతో వచ్చే ఏడాది మెగా వేలం జరగనుంది. ఈ డిసెంబర్‌లోనే ఈ మెగా ఆక్షన్ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ముగ్గురు భారతీయులు మరియు 1 విదేశీ ప్లేయర్.. లేదా ఇద్దరు భారతీయులు మరియు ఇద్దరు విదేశీలు ఉండే అవకాశం ఉంది. ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంటే రూ.15 కోట్లు, రూ.11 కోట్లు, రూ.7 కోట్లు వారికి చెల్లించాలి. ఇద్దరిని తీసుకుంటే రూ.12.5 కోట్లు, రూ.8.5 కోట్లు.. ఒక్కరినే తీసుకుంటే రూ.12.5 కోట్లు ఇవ్వాలి.

రూ. 100 కోట్లు..
ఆటగాళ్లకు చెల్లించే జీతాల నిధి మొత్తాన్ని రూ.85 నుంచి 90 కోట్లకు బీసీసీఐ పెంచింది. అంటే 10 ఫ్రాంచైజీల నుంచి రూ.50 కోట్లు జమ అవుతుంది. ఫ్రాంచైజీలు ఇందులో కనీసం 75% ఖర్చు చేయాలి. ఏటా రూ. 5 కోట్లు పెంచుతూ.. 2024కు ఈ జీతాల నిధిని రూ.100 కోట్లకు చేరుస్తారని తెలిసింది. ఇక సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్స్ దుబాయ్ చేరి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications