
ముంబై: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి భారీ నష్టం వాటిల్లింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 37 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తన ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకున్నాడు. ముందుగా బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన హార్దిక్.. ఆ తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్‌తో మెరిసాడు. ఇక హార్దిక్ సూపర్ ఫీల్డింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ రనౌటయ్యాడు. ఈ వికెట్ మ్యాచ్‌కే టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
అయితే శాంసన్‌ను రనౌట్ చేసే క్రమంలో హార్దిక్ పాండ్యా బుల్లెట్ వేగంతో విసిరిన త్రో దెబ్బకు మిడిల్ స్టంప్ విరిగి రెండు ముక్కలైంది. హార్ధిక్ ఉద్దేశపూర్వకంగా చేయని ఈ పని వల్ల ఐపీఎల్ నిర్వహకులకు లక్షల్లో నష్టం వాటిల్లింది. ఆధునిక టెక్నాలజీని వినియోగించి తయారు చేసే ఈ ఎల్‌ఈడీ వికెట్ల ధర రూ. 45 లక్షల వరకు ఉంటుంది. ఈ మొత్తం టీమిండియా మ్యాచ్ ఫీజ్‌కు దగ్గరగా ఉంది. టీమిండియా వన్డే మ్యాచ్ ఆడితే ఒక్కో ఆటగాడికి రూ. 60 లక్షలు లభిస్తుండగా, టీ20 మ్యాచ్‌కు రూ. 33 లక్షలు మ్యాచ్ ఫీజుగా వస్తుంది.
2013లో ఎల్‌ఈడీ స్టంప్స్ వినియోగంలోకి వచ్చాక ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరిగాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏదైనా ఆటగాడి వల్ల ఎల్‌ఈడీ స్టంప్స్‌కు నష్టం వాటిల్లితే, ఆ ఖర్చు నిర్వహకుల జేబులో నుంచే భరించాలి. కాబట్టి నిన్న హార్ధిక్ పాండ్యా అనుకోకుండా చేసిన పని వల్ల ఐపీఎల్ నిర్వహకులకు రూ. 45 లక్షల వరకు నష్టం వాటిల్లింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' కెప్టెన్ హార్దిక్ పాండ్యా (52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 నాటౌట్) చివరి దాకా నిలబడి పరుగులు సాధించగా, అభినవ్ మనోహర్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) రాణించాడు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసి ఓడింది. జోస్ బట్లర్ (24 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) చెలరేగాడు. ఫెర్గూసన్ (3/23) కీలక వికెట్లు తీశాడు.