
కెప్టెన్‌గా మనీష్ పాండే
పైగా దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక కెప్టెన్‌గా పలు టైటిళ్లు అందించిన ఘనత అతని సొంతం. ఈ క్రమంలో కెప్టెన్ అవసరం ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ మనీష్ పాండేపై కన్నేసినట్లు తెలుస్తోంది. అతన్ని వేలంలో కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలనుకుంటుంది. ఈ క్రమంలోనే మనీశ్ పాండే కోసం భారీ మొత్తాన్ని పక్కనపెట్టినట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది జట్టును ఫైనల్ చేర్చినప్పటికీ ఇయాన్ మోర్గాన్‌ను కేకేఆర్ వదులుకుంది.

పర్స్‌మనీలో రూ. 56 కోట్లు
కెప్టెన్‌గా పర్వాలేదనిపించినా బ్యాట్స్‌మన్‌గా అతను దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతన్ని వదులుకొని ఆండ్రీ రస్సెల్(రూ.12 కోట్లు), వరుణ్ చక్రవర్తీ(రూ.8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ.8 కోట్లు), సునీల్ నరైన్ (రూ.6 కోట్లు)లను అంటిపెట్టుకుంది. మాజీ కెప్టెన్ దినేశ్ కార్తీక్‌ను కూడా వదులుకున్న కేకేఆర్‌కు ఇప్పుడు ఓ సారథి కావాలి. రిటెన్షన్ ప్రక్రియలో ఎంచుకున్న ఆటగాళ్ల కోసం ఆ జట్టు రూ.34 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. ఇంకా కేకేఆర్ దగ్గర రూ.56 కోట్లు ఉన్నాయి. మిగతా జట్లతో పోలిస్తే కేకేఆర్ దగ్గర చాలా డబ్బులే ఉన్నాయి.

పాండేనే బెస్ట్ ఆప్షన్..
కెప్టెన్సీ స్లాట్ కోసం శ్రేయస్ అయ్యర్‌ను ఫస్ట్ టార్గెట్‌గా పెట్టుకున్న కోల్‌కతా పునరాలోచనలో పడింది. వేలంలో కొత్త కెప్టెన్ అవసరం ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ అయ్యర్ కోసం పోటీపడనున్నాయి. అత్యధిక డబ్బులు ఉన్న పంజాబ్ కింగ్స్ అతని కోసం ఎంత ధరైన చెల్లించేందుకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలోనే అయ్యర్ రూ. 20 కోట్లు పలికే చాన్సుందని విశ్లేషకుల అంచనా. అయితే అయ్యర్‌కే రూ. 20 కోట్లు పెడితే మిగతా ఆటగాళ్లను తీసుకోలేమని కేకేఆర్ భావిస్తోంది. ఈ క్రమంలోనే మనీష్ పాండేనే బెస్ట్ ఆప్షన్‌గా భావిస్తోంది.

రూ. 10 కోట్ల లోపే ..
ఐపీఎల్ 2018లో రూ. 11 కోట్ల భారీ ధరకు మనీశ్ పాండేను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అయితే తొలి రెండు సీజన్లలో పర్వాలేదనిపించిన అతను గత రెండు సీజన్లలో దారుణంగా విఫలమయ్యాడు. టీమ్ చెత్త పెర్ఫామెన్స్, అనుభవం లేమి ఆటగాళ్లతో పాండే తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.
డేవిడ్ వార్నర్ వైఫల్యం అతనిపై తీవ్ర ప్రభావం చూపింది. దాంతో సరిగ్గా రాణించలేకపోయాడు. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ అతన్ని వదులుకుంది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి అందుబాటులో ఉన్న పాండే కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది.
అతను సులువుగా రూ. 7 కోట్ల నుంచి రూ. 10 కోట్లు పలికే చాన్సుంది. ఇక తమ మాజీ ప్లేయర్ అయిన పాండే కోసం రూ. 10 కోట్లు చెల్లించేందుకు కేకేఆర్ సిద్దంగా ఉంది. 2014లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో మనీష్ పాండే కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో 94 పరుగులతో సత్తా చాటాడు.


Click it and Unblock the Notifications
