IPL 2022 Auction: సూర్యకుమార్ యాదవ్‌పై కన్నేసిన ఆ మూడు జట్లు!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగే అవకాశాలు కనిపించడం లేదు. గత మూడేళ్లుగా ముంబై తరఫున దుమ్మురేపిన ఈ ఇండియన్ బ్యాట్స్‌మన్ కోసం ఇతర ఫ్రాంచైజీలు కాచుకొని కూర్చున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రణాళికల ప్రకారం వచ్చే సీజన్ మెగా వేలం జరగనుంది.
అలాగే రెండు కొత్త జట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ కరోనా మహమ్మారి బీసీసీఐ ప్రణాళికలన్నిటిని గల్లంతు చేసింది. దాంతో వచ్చే సీజన్ ప్రణాళికలపై నీలినీడలు కమ్ముకున్నాయి. కొత్త జట్ల ఆలోచన దారితప్పింది. మెగా వేలంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ మెగా వేలం జరిగితే మాత్రం సూర్యకుమార్ యాదవ్ ముంబై టీమ్ నుంచి చేజారనున్నాడు.

అడ్డురానున్న రూల్స్..
కరోనా ఆగిపోయి ఈ సీజన్‌లో కూడా సూర్య అద్భుతంగా రాణించాడు. 7 మ్యాచ్‌ల్లో 173 పరుగులతో ముంబై తరఫు సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే బలమైన కోర్ టీమ్ కలిగిన ముంబై ఇండియన్స్.. మెగా వేలం నిబంధనల మేరకు కొంతమందినే రిటైన్ చేసుకునే చాన్స్ ఉంటుంది.
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్‌లను ఆ జట్టు ఎలాగు వదులుకోలేదు. కాబట్టి సూర్య కుమార్‌యాదవ్ జట్టును వీడటం ఖాయం. వేలంలో మళ్లీ కొనుగోలు చేయాలని ఆ జట్టు భావించినా.. ఇతర జట్లు సూర్యకోసం కాచుకొని కూర్చున్నాయి. ఎంతటి ధరనైనా చెల్లించేందుకు సిద్దంగా ఉన్నాయి. ముఖ్యంగా మూడు జట్లు సూర్య తీసుకునేందుకు రెడీగా ఉన్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్..
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం బలమైన ఇండియన్ లైనప్‌తోనే ముందుకుసాగింది. అయితే మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనాల వయసు ధృష్ట్యా వారిని రిటైన్ చేసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ జట్టుకు మ్యాచ్ విన్నర్లు కావాలి. అది కూడా భారత ఆటగాళ్లయి ఉండాలి. సూర్యకుమార్ యాదవ్ వంటి విభిన్నమైన ఆటగాడు ఆ జట్టుకు సరిగ్గా సరిపోతాడు. అతను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. ముఖ్యంగా స్పిన్నర్లను సమర్థవంతంగా ఆడగలడు. సూర్యలాంటి బ్యాట్స్‌మెన్ చెన్నైకి చాలా అవసరం.

ఢిల్లీ క్యాపిటల్స్..
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బలమైన ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఆ జట్టు రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, పృథ్వీషా, శిఖర్ ధావన్‌లను రిటైన్ చేసుకోవచ్చు. ఇప్పటికే బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న ఆ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ చేరికతో అదనపు బలం చేకూరుతుంది. మిడిలార్డర్‌లో ఆ జట్టుకు అనుభవం కలిగిన బ్యాట్స్‌మన్ అవసరం. సూర్యకు ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్‌లో కావాల్సిన అనుభవం ఉంది. అతను ధాటిగా ఆడటంతో పాటు యాంకర్ రోల్ కూడా పోషించగలడు. సూర్యను పృథ్వీ షాతో కలిసి ఓపెనర్‌గా కూడా ఆడించవచ్చు. లేదంటే ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ పంపించి.. అయ్యర్, పంత్‌లను తర్వాతి స్థానాల్లో ఆడించవచ్చు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..
సూర్యకుమార్ యాదవ్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ యువ బ్యాట్స్‌మన్ కోసం ఎంత ధరనైనా చెల్లించేందుకు ఆ జట్టు సిద్దపడుతోంది. ఎందుకంటే ఆ జట్టులోని ఇండియన్ బ్యాట్స్‌మన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ మినహా మరే భారత ఆటగాడు సత్తా చాటలేకపోతున్నాడు.
గత కొన్నేళ్లుగా ఆ జట్టు ఈ సమస్యతో బాధపడుతుంది. ఈ సీజన్‌లో రజత్ పటీదార్, షాబాజ్ నదీమ్‌లను తీసుకున్నా.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టి సూర్యకుమార్‌ను తీసుకుంటే ఆ జట్టు బ్యాటింగ్ బలం పెరగనుంది. కోహ్లీ, పడిక్కల్ ఓపెనర్లుగా వస్తే.. సూర్య, డివిలియర్స్ మిడిలార్డర్ బాధ్యతలు తీసుకోవచ్చు. కాబట్టి సూర్య కోసం ఆర్‌సీబీ ఎంతకైనా తెగించవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications