
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం చర్చనీయాంశమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో వాంఖడే వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డయ్యాడు. రాజస్థాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ విసిరిన ఇన్ స్వింగ్ డెలివరీని కేఎల్ రాహుల్ ఆడలేకపోయాడు. రెప్పపాటు సమయంలోనే బ్యాట్, ఫ్యాడ్ మధ్యలో నుంచి దూసుకొచ్చిన బంతి వికెట్లని గీరాటేసింది. దాంతో రాహుల్ బిత్తరపోయాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు.
రాహుల్ గోల్డెన్ డక్‌తో అతని ఫియాన్సీ అతియ శెట్టి మనసు చివుక్కుమంది. కాబోయే భర్త ఆటను చూసేందుకు తండ్రి సునీల్ శెట్టితో కలిసి మ్యాచ్‌కు వచ్చిన అతియాకు నిరాశే ఎదురైంది. కేఎల్ రాహుల్ గోల్డెన్ డకౌటవ్వడంతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలవ్వడం ఆమెను మరింత బాధపెట్టింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ గోల్డెన్ డకౌటవ్వడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది.
అతను ఔటైన తీరుని నమ్మలేనట్లు కాసేపు అలానే షాక్‌లో ఉండిపోయింది. ఆమె తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా నిరాశకు గురయ్యాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఔట్‌కు సంబంధించిన వీడియో, అతియా రియాక్షన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. షిమ్రన్ హెట్‌మైర్(36 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 4 ఫోర్లతో 29), రవిచంద్రన్ అశ్విన్(23 బంతుల్లో 2 సిక్స్‌లతో 28) రాణించారు. లక్నో బౌలర్లలో జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్ రెండేసి వికెట్లు తీసారు. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. మార్కస్ స్టోయినీస్, క్వింటన్ డికాక్(32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 39)టాప్ స్కోరర్లుగా నిలవగా.. దీపక్ హుడా(24 బంతుల్లో 3 ఫోర్లతో 25), కృనాల్ పాండ్యా(15 బంతుల్లో 2 ఫోర్లతో 22) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లతో సత్తా చాటగా.. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టాడు. ప్రసిధ్, కుల్దీప్ సేన్‌కు తలో వికెట్ దక్కింది.